కలం, మహబూబ్ నగర్ బ్యూరో : సాటి మనుషులను మనిషిగా గుర్తించలేకపోవడం ప్రతిపక్ష పార్టీలకు పరిపాటుగా మారిందని డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ (Sanjeev Mudiraj) ఆరోపించారు. మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ అధికార ప్రతినిధి లోకేష్ యాదవ్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ సమక్షంలో శనివారం విలేకరుల సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి హాజరైన సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ.. ఇటీవల అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మాతృమూర్తిని దూషించిన తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. అలాగే కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డప్పు చప్పుళ్లతో నిరసన తెలిపిన అనంతరం, మరుసటి రోజు పసుపు నీళ్లతో శుద్ధి చేయడం దళితులను మరోసారి అవమానించడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫామ్‌హౌస్ ముట్టడి ఘటనపై విమర్శలు
“సాటి మనిషిని మనిషిలా చూడకపోవడం అవమాన కరమన్నారు. బీఆర్ఎస్ అహంకార భావాన్ని తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తోందనీ, దళితులు, బడుగు బలహీన వర్గాల పట్ల ఇలాంటి అగౌరవ పోకడలను ఇకనైనా మానుకోవాలి” అని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్‌ను ఎమ్మెల్యేగా గెలిపించింది ప్రజలేనని, ప్రతిపక్ష నేతగా ప్రజలు అవకాశం కల్పిస్తే ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఫార్మ్‌హౌస్‌లో పడుకొని భోగాన్ని అనుభవించడమా? సిగ్గు సిగ్గు” అని ఆయన విమర్శించారు. తెలంగాణ ఉద్యమం ద్వారా మన ఉద్యోగాలు మనకు, మన నీళ్లు మనకు రావాలనే ఆకాంక్షతో రాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఇది ప్రజల పోరాటంతో సాధించుకున్న తెలంగాణ అని అన్నారు.
ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి
అలాంటి తెలంగాణలో బడుగు బలహీన వర్గాల పట్ల అగౌరవంగా వ్యవహరించడం ఏమాత్రం సమర్థనీయం కాదని తెలిపారు. బడుగు బలహీన వర్గాల పట్ల అగౌరవ పోకడలను ఇకనైనా మానుకుని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని లోకేష్ యాదవ్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా చేసిన అసభ్యకరమైన పోకడలను తెలంగాణ సమాజం గమనిస్తోందని, మహిళా పోలీసుల పట్ల వ్యవహరించిన తీరుతో పాటు వారు చేస్తున్న ప్రతి వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఈ మీడియా సమావేశంలో సత్తూరి చంద్రకుమార్ గౌడ్, బెక్కరి మధు, జహీర్ అక్తర్, ఆనంద్ గౌడ్, మురళి గౌడ్, రాములు యాదవ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అవీజ్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్దలు పాల్గొన్నారు.

