కలం, ఉట్నూరు: నర్సాపూర్ (బి) గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) అధికారులను ఆదేశించారు. ఉట్నూరు మండలంలోని నర్సాపూర్ (బి) గ్రామంలో గురువారం ఆయన విస్తృతంగా పర్యటించారు. గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలతో గడువులోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ సూచించారు. గ్రామంలో రెడ్కో ఆధ్వర్యంలో జరుగుతున్న సోలార్ ప్లాంటేషన్ సర్వే ప్రక్రియను పరిశీలించారు. పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుకూలమైన స్థలాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఆశ్రమ పాఠశాలలో భోజన నాణ్యతపై తనిఖీ
అనంతరం స్థానిక ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలను (Ashram High School) తనిఖీ చేసి, స్టోర్‌రూమ్, వంటగదిని కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు అందించే భోజన నాణ్యతపై ఆరా తీసి, నిల్వ ఉంచిన సరుకులను తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎల్లప్పుడూ పౌష్టికాహారాన్ని అందించాలని, ఆహార పదార్థాల నిల్వలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో సబ్ కలెక్టర్ కే.ప్రణయ్‌కుమార్, తహసీల్దార్ రఘునాథ్ రావు, మండల స్థాయి అధికారులు, రెడ్కో ప్రతినిధులు శ్రీనివాస్, హౌసింగ్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

