పాకిస్థాన్‌పై భారత్ 19-0తో ఘనవిజయం

కలం, స్పోర్ట్స్ : చైనాలోని మోఖీలో జరుగుతున్న 2026 మహిళల జూనియర్ ఆసియా కప్‌లో (Womens Junior Asia Cup)  డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ (India) అదరగొట్టింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై (Pakistan) 19-0తో ఘన విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మ్యాచ్ ఆరంభం నుంచే భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. 7వ నిమిషంలో పూజా సాహూ తొలి గోల్ చేసి భారత్‌కు శుభారంభం అందించగా.. 9వ నిమిషంలో రోష్ని ఐండ్ రెండో గోల్ సాధించారు. ఆ తర్వాత తనుశ్రీ దినేష్ కాడు, సుఖ్‌వీర్ కౌర్, సనిక చంద్రకాంత్ మనే వరుసగా గోల్స్ చేశారు. 23వ నిమిషంలో సనిక మరో గోల్ సాధించారు.

మధు సిదార్, గీతా యాదవ్ కూడా గోల్స్ చేయడంతో భారత్ ఆధిక్యం మరింత పెరిగింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి తనుజ తోప్పో, పూజా మాలిక్, పూర్ణిమ యాదవ్ గోల్స్ చేయడంతో భారత్ 10-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో సగంలోనూ భారత ఆటగాళ్లు అదే దూకుడు కొనసాగించారు. పూజా మాలిక్ 49, 51వ నిమిషాల్లో గోల్స్ చేసి హ్యాట్రిక్ పూర్తి చేసుకున్నారు. సుప్రియ రెండు గోల్స్ చేయగా.. కృష్ణ శర్మ, బినిమా ధన్ కూడా స్కోరు బోర్డులో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. మ్యాచ్ చివరి నిమిషంలో రోష్ని ఐండ్ మరో గోల్ చేయడంతో భారత్ 19-0తో చారిత్రాత్మక విజయాన్నిఅందుకుంది.

గ్రూప్ దశలో జపాన్, మలేషియా, దక్షిణ కొరియాలను ఓడించి అగ్రస్థానంలో నిలిచిన భారత్.. ఇప్పుడు సెమీఫైనల్‌లో దక్షిణ కొరియా, మలేషియా మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్ విజేతతో తలపడనుంది. 2023, 2024లో టైటిళ్లు సాధించిన భారత జట్టు, వరుసగా మూడోసారి మహిళల జూనియర్ ఆసియా కప్‌ను కైవసం చేసుకునేందుకు మరో రెండు విజయాల దూరంలో ఉంది. సెమీఫైనల్‌లోనూ భారత్ ఇదే జోరును కొనసాగిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>