కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో భారీ వర్షం (Heavy Rain) కురిసింది. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో చాలా చోట్ల వర్షం కురుస్తోంది. జిల్లా అంతటా వాతావరణం చల్లగా మారిపోయింది. గత కొన్ని రోజులుగా ముఖం చాటేసిన వర్షాలు మళ్లీ పలకరించాయి. దీంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి రాష్ట్రంలో నిజామాబాద్ కామారెడ్డి రెండు జిల్లాలు వర్షపాతంపరంగా లోటు లేనప్పటికీ ఇంకా కొన్నిచోట్ల వర్షాల కోసం, నీళ్ల కోసం రైతన్నలు ఎదురుచూస్తున్నారు. కొన్నిచోట్ల సమృద్ధిగా నీళ్లు లేక వ్యవసాయ భూములు నెర్రెలు చాస్తున్న పరిస్థితులు ఉన్నాయి.
ప్రాజెక్టుల్లోకి నీరు చేరితే పంటలకు మేలు
మరోవైపు ఇంకొన్ని చోట్ల భూగర్భ జలాలు సైతం ఎండిపోయిన సందర్భాలు కనిపిస్తున్నాయి. ఎల్నినో ప్రభావం వల్ల జూన్, జూలై నెలల్లో ఆశించిన వర్షాలు కురవలేదు. ఆగస్టు నెలలోనే వర్షాలు భారీగా కురిసాయి. దీంతో ప్రాజెక్టుల్లోకి సగం నిండే లాగా నీళ్లు చేరాయి. ఇప్పటికీ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 80 అయితే గురువారం 46 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. నిజాంసాగర్ ప్రాజెక్టు పరిస్థితి కూడా అలాగే కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఇంకా భారీ వర్షాలు కురిసి ప్రాజెక్టులోకి నీళ్లు చేరితే రానున్న రోజుల్లో పంటలు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వర్షాలు కురవాలని రైతన్నలు కోరుకుంటున్నారు.

