సిట్సిపాస్ ఓటమి: టెన్నిస్‌లో 150 ఏళ్ల చరిత్ర ఖతం!

కలం, స్పోర్ట్స్ : యూఎస్ ఓపెన్ (US Open 2026) టెన్నిస్ టోర్నీలో చరిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది. ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన పురుషుల సింగిల్స్ నాలుగో రౌండ్‌లో అమెరికా ఆటగాడు బెన్ షెల్టన్.. గ్రీస్ స్టార్ స్టెఫానోస్ సిట్సిపాస్‌ను (Stefanos Tsitsipas) 6-2, 6-3, 6-4 తేడాతో ఓడించాడు. ఈ పరాజయంతో దాదాపు 150 ఏళ్ల టెన్నిస్ చరిత్రలో అరుదైన ఘట్టం నమోదైంది. 1877లో వింబుల్డన్ ప్రారంభమైనప్పటి నుంచి వన్ హ్యాండెడ్ బ్యాక్‌హ్యాండ్‌కు (One-Handed Backhand) టెన్నిస్‌లో ప్రత్యేక గుర్తింపు ఉంది.

జాన్ మెకన్రో, పీట్ సంప్రాస్, రోజర్ ఫెడరర్, స్టాన్ వావ్రింకా, డొమినిక్ థీమ్ వంటి దిగ్గజాలు ఈ షాట్‌తో ప్రపంచ టెన్నిస్‌లో తమదైన ముద్ర వేశారు. ఒకప్పుడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో వన్ హ్యాండెడ్ బ్యాక్‌హ్యాండ్ ఆటగాళ్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపించేది. 1905లో నాలుగు గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్స్‌లో ఏకంగా 16 మంది వన్ హ్యాండెడ్ ప్లేయర్లు ఉండగా.. 2005 నాటికి ఆ సంఖ్య ఐదుకు తగ్గింది. గతేడాది కేవలం ఇటలీ ఆటగాడు లోరెంజో ముసెట్టి మాత్రమే సెమీఫైనల్‌కు చేరగలిగాడు.

ఈ ఏడాది వన్ హ్యాండెడ్ బ్యాక్‌హ్యాండ్ సంప్రదాయాన్ని కొనసాగించే చివరి ఆశ సిట్సిపాస్‌పైనే ఉండేది. తనపై 150 ఏళ్ల టెన్నిస్ సంప్రదాయాన్ని కాపాడే బాధ్యత ఉందన్న భావనను ఆయన సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. అయితే బెన్ షెల్టన్ ధాటికి సిట్సిపాస్ పోరాటం ఎక్కువసేపు సాగలేదు. షెల్టన్‌ పవర్‌ఫుల్ షాట్లకు సిట్సిపాస్‌ వద్ద సమాధానం లేకపోయింది. వరుస సెట్లలో ఓటమి చవిచూడటంతో యూఎస్ ఓపెన్‌లో అతని ప్రయాణం ముగిసింది. దీంతో గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ చరిత్రలో తొలిసారిగా ఒక క్యాలెండర్ సంవత్సరంలో ఒక్క వన్ హ్యాండెడ్ బ్యాక్‌హ్యాండ్ ఆటగాడు కూడా సెమీఫైనల్‌కు చేరని పరిస్థితి ఏర్పడింది.

వేగం.. పవర్‌తో మారిన టెన్నిస్

మోడ్రన్ టెన్నిస్‌లో వేగం, పవర్ విపరీతంగా పెరగడం వన్ హ్యాండెడ్ బ్యాక్‌హ్యాండ్ కనుమరుగవడానికి ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా వేగవంతమైన సర్వ్‌లు, బలమైన గ్రౌండ్‌ స్ట్రోక్‌లను ఎదుర్కోవడంలో టూ హ్యాండెడ్ బ్యాక్‌హ్యాండ్ మరింత ప్రభావవంతంగా ఉండటంతో కోచ్‌లు, యువ ఆటగాళ్లు ఆ శైలికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆటలో కాలానుగుణంగా మార్పులు సహజమే అయినప్పటికీ.. ఒకప్పుడు టెన్నిస్ కోర్టుల్లో కళాత్మకతకు ప్రతీకగా నిలిచిన వన్ హ్యాండెడ్ బ్యాక్‌హ్యాండ్ కనుమరుగవుతున్న తీరు అభిమానులను మాత్రం నిరాశకు గురిచేస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>