ఉట్కూర్‌లో కరువు నివారణకు కలెక్టర్‌ పక్కా ప్లాన్‌

కలం, నారాయణపేట: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రైతు కుటుంబానికి ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరేలా, స్థిరమైన ఆదాయ వనరులను కల్పించే విధంగా సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ (Narayanpet Collector) ప్రియాంక (Priyanka) అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో కలెక్టర్ ప్రియాంక అధ్యక్షతన కరువు నివారణ (Drought Mitigation)పై జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో చేపడుతున్న డ్రాట్ మిటిగేషన్ కార్యక్రమం కింద నారాయణపేట జిల్లాలోని ఉట్కూర్ (Utkoor) మండలాన్ని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమం అమలు బాధ్యతలను వాసన్ సంస్థ చేపట్టింది. సమావేశంలో వాసన్ సంస్థ ప్రతినిధులు డీపీఆర్‌ను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్‌కు వివరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ కుటుంబాల అవసరాలు, స్థానిక వనరులు, రైతుల సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకుని వివిధ కార్యక్రమాలను ఒకే సమగ్ర ప్రణాళిక కింద అనుసంధానం చేయాలని సూచించారు. అందుబాటులో ఉన్న నిధులను చిన్నచిన్న కార్యక్రమాలుగా విభజించడం కంటే, ఎక్కువ మంది రైతు కుటుంబాలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరేలా ఒక ప్రధాన ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని తెలిపారు. వ్యవసాయంతో పాటు పశుసంవర్ధక, పౌల్ట్రీ, డెయిరీ, గొర్రెలు, మేకల పెంపకం వంటి లైవ్‌స్టాక్ రంగాలను కూడా ప్రణాళికలో భాగం చేయాలని సూచించారు. పౌల్ట్రీ, లైవ్‌స్టాక్ రంగాల్లో ఉన్న అవకాశాలను గుర్తించి రైతులకు అవసరమైన ఇన్‌పుట్స్, సాంకేతిక సహాయం, శిక్షణ, వెటర్నరీ సేవలు, మార్కెట్ లింకేజీ అందేలా సమగ్ర వ్యవస్థను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

ఒక్కో ప్రాంతంలో ఒక యూనిట్ ఏర్పాటు చేసి వదిలేయకుండా, ఉత్పత్తి నుంచి మార్కెటింగ్ వరకు పూర్తి విలువ గొలుసును అభివృద్ధి చేయాలని కలెక్టర్ సూచించారు. ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకులు, ఇన్‌పుట్స్, ఉత్పత్తి, సేకరణ, ప్రాసెసింగ్, నిల్వ, మార్కెటింగ్ వంటి అన్ని అంశాలను సమన్వయం చేయాలని తెలిపారు. గ్రామ పంచాయతీలను కేవలం సహజ వనరుల నిర్వహణ (ఎన్‌ఆర్‌ఎం) కార్యక్రమాలకే పరిమితం చేయకుండా, ప్రతి కుటుంబ ఆదాయం, ఆహార భద్రత, వ్యవసాయం, పశుసంపద, ఎంటర్‌ప్రైజెస్, ఉపాధి అవకాశాలను అనుసంధానం చేసే వేదికగా అభివృద్ధి చేయాలని సూచించారు.

ప్రతి కుటుంబం అవసరాలు, సామర్థ్యాలకు అనుగుణంగా తగిన ఎంటర్‌ప్రైజ్‌ను గుర్తించి, ఆర్థిక సంస్థలు, సంబంధిత శాఖలు, మార్కెట్ సంస్థల సహకారంతో అమలు చేసే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. “ఒక గ్రామం–ఒక సమగ్ర ప్రణాళిక–ప్రతి కుటుంబానికి ప్రయోజనం–స్థిరమైన ఆదాయం” అనే లక్ష్యంతో కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి, వాటిని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ ప్రియాంక సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>