అరోనియన్ వ్యాఖ్యలు.. క్రామ్నిక్ కౌంటర్!

కలం, స్పోర్ట్స్: అమెరికన్ చెస్ గ్రాండ్‌మాస్టర్ లెవాన్ అరోనియన్ (Levon Aronian) చేసిన వ్యాఖ్యలు చెస్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. తన చెస్ అవగాహన అనేకమంది ప్రపంచ ఛాంపియన్ల కంటే మెరుగైనదని ఆయన పేర్కొనడం ఆసక్తికర చర్చకు దారితీసింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకోవడమే తనకు ఒక పెద్ద అద్భుతమని అరోనియన్ వ్యాఖ్యానించారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లాసికల్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలవలేకపోవడంపై స్పందించిన అరోనియన్.. అందుకు తనకు ఎలాంటి బాధ లేదని స్పష్టం చేశారు. చెస్ ఆటగాడిగా తాను ఎప్పుడూ ఇంతటి స్థాయికి చేరుకుంటానని ఊహించలేదన్నారు. జీవితంలో నిర్దిష్ట లక్ష్యాలను పెట్టుకోవడం ఒత్తిడిని పెంచుతుందని, తన వద్ద ఉన్నదాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగడమే సరైన మార్గమని అభిప్రాయపడ్డారు.

క్రామ్నిక్ ఘాటు స్పందన

అరోనియన్ వ్యాఖ్యలపై మాజీ ప్రపంచ ఛాంపియన్ వ్లాదిమిర్ క్రామ్నిక్ (Vladimir Kramnik)  ఎక్స్ వేదికగా స్పందించారు. అరోనియన్‌ను అసాధారణమైన చెస్ క్రీడాకారుడిగా అభివర్ణించిన ఆయన.. అదే సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలను వ్యంగ్యంగా ప్రశ్నించారు. చాలామంది ప్రపంచ ఛాంపియన్ల కంటే తనకు మెరుగైన చెస్ అవగాహన ఉందని అరోనియన్ చెప్పడాన్ని క్రామ్నిక్ నేరుగా ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యను ‘వినమ్రమైన ఆత్మవిశ్వాసం’గా పేర్కొంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

అరోనియన్ ఘనమైన కెరీర్

అరోనియన్ క్లాసికల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలవకపోయినా, చెస్‌లో అగ్రశ్రేణి ఆటగాడిగా తనదైన ముద్ర వేశారు. ఆయన గరిష్టంగా 2830 రేటింగ్‌తో ప్రపంచ రెండో ర్యాంక్ సాధించారు. అంతేకాకుండా రెండుసార్లు వరల్డ్ కప్ టైటిల్‌ను గెలుచుకున్నారు. అర్మేనియా తరఫున మూడు ఒలింపియాడ్ స్వర్ణ పతకాలు సాధించడంలోనూ అరోనియన్ కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో అరోనియన్ చేసిన వ్యాఖ్యలు, క్రామ్నిక్ ఇచ్చిన స్పందన చెస్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరతీశాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>