కలం, నల్లగొండ బ్యూరో: పట్టణ సుందరీకరణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పేరుతో నల్లగొండ (Nalgonda) మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల ఆక్రమణల తొలగింపు చర్యలు చిరువ్యాపారులను రోడ్డున పడేస్తున్నాయి. మరోవైపు నిబంధనలను లెక్కచేయని బడా వ్యాపార సముదాయాలు, మాల్స్, హోటళ్ల వైపు కన్నెత్తి చూడకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. కేంద్రం తెచ్చిన ‘స్ట్రీట్ వెండర్స్ యాక్ట్’ ప్రకారం వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి, ప్రత్యేక వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్‌పై ఉంది. కానీ నల్లగొండలో మాత్రం చట్టాలు కేవలం పేదలపై ప్రయోగించడానికే ఉన్నాయా..! అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాత్రికి రాత్రే కూల్చివేతలు
ఒకవైపు బడాబాబుల ఆక్రమణలకు రక్షణ కల్పిస్తున్న అధికారులు.. మరోవైపు ఏళ్లుగా రోడ్ల పక్కన చిన్న కొట్లు, తోపుడు బండ్లు పెట్టుకుని జీవించే పేదలపై తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా, సామగ్రి సర్దుకునే సమయం కూడా లేకుండానే అర్ధరాత్రి జేసీబీలతో కొట్లను నేలమట్టం చేస్తున్నారు. గతంలో ప్రకాశం బజార్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా కూల్చివేయించిన ఘటన నుంచి నేటి వరకు ముందస్తు నోటీసులిచ్చే సంప్రదాయమే లేకుండా పోయింది. పాత కలెక్టరేట్ వద్ద జనసంచారం లేని లోపలి ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ స్థలాలు చూపడంతో గిరాకీ లేక వ్యాపారులు అల్లాడుతున్నారు. గతంలో ఎన్జీ కాలేజీ, మార్కెట్ యార్డు వద్ద నిర్మించిన షెడ్లు ఇప్పటికీ నిరుపయోగంగానే పడి ఉన్నాయి.
బడా వ్యాపారులపై చర్యలేవీ..?
అదే పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట ఉన్న పెద్ద షాపింగ్ మాల్స్, కార్పొరేట్ హోటళ్లు, వాణిజ్య సముదాయాలు అర గజం కూడా పార్కింగ్ స్థలం కేటాయించకుండానే నిబంధనలకు విరుద్ధంగా వెలిశాయి.
మాల్స్, హోటళ్లకు వచ్చే వినియోగదారులు వాహనాలను యథేచ్ఛగా ప్రధాన రహదారులపైనే పార్క్ చేస్తున్నారు. దీంతో నిత్యం తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నా మున్సిపల్, ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదు.
బడా వ్యాపారుల నుంచి నెలనెలా అందుతున్న ‘మామూళ్ల’ వల్లే అధికారులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదనే తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంప్లెక్స్‌ల ముందు ఫుట్‌పాత్‌లను ఆక్రమించి మెట్లు, బోర్డులు నిర్మించినా అధికారులు పట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బాధితుల తరఫున పోరుకు సిద్ధం
పేదల పొట్ట కొడుతూ, బడాబాబులకు కొమ్ముకాస్తున్న అధికారుల తీరుపై బీఆర్ఎస్ మండిపడింది. చట్టబద్ధమైన ప్రత్యామ్నాయం చూపకుండా చిరు వ్యాపారులను రోడ్డున పడేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది. బాధితులకు అనుకూలమైన ప్రాంతాల్లో ఉపాధి చూపే వరకు క్షేత్రస్థాయి పోరాటానికి సిద్ధమవుతున్నట్లు పార్టీ నేతలు స్పష్టం చేశారు. పార్కింగ్ లేని పెద్ద భవనాలపై చర్యలు తీసుకోకుండా, కేవలం చిరు వ్యాపారుల పొట్ట కొట్టడంతో పట్టణ ట్రాఫిక్ సమస్య తీరదని పేర్కొంటున్నారు. యంత్రాంగం పక్షపాత వైఖరి వీడి, అర్హులైన చిరు వ్యాపారులందరికీ గిరాకీ వచ్చే ప్రాంతాల్లో పునరావాసం కల్పించడమే కాకుండా బడాబాబుల ఆక్రమణలపై కూడా సమానంగా చట్టాన్ని ప్రయోగించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు.

