కేబినెట్ రేసులో ‘ఆది’.. బీసీ కార్డు ఫలించేనా?

కలం, కరీంనగర్ బ్యూరో: మంత్రివర్గంలో మార్పులు, చేర్పులపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించిన వేళ తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ వార్తలు ఊపందుకోవడంతో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం, పార్టీ పట్ల విధేయత వంటి అంశాలు ఆది శ్రీనివాస్‌కు అనుకూలంగా కనిపిస్తున్నప్పటికీ అధిష్ఠానానికి కొన్ని క్లిష్టమైన రాజకీయ సవాళ్లు కూడా స్వాగతం పలుకుతున్నాయి.

మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయడం, సామాజిక సమీకరణాలను సమతుల్యం చేయడం పార్టీ అధిష్ఠానానికి ప్రధాన ప్రాధాన్యతగా మారింది. ఈ పరిణామాల మధ్య వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేరు మంత్రి పదవి రేసులో ముందు వరుసలో బలమైన పోటీదారుగా తెరపైకి రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

బీసీ (మున్నూరు కాపు) ఓటు బ్యాంక్ సమీకరణం..

కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం, బీసీ వర్గాల ప్రాతినిధ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర రాజకీయాల్లో మున్నూరు కాపు వర్గం కీలకమైంది. ప్రస్తుతం శాసనసభలో కాంగ్రెస్ తరఫున గెలిచిన మున్నూరు కాపు ఎమ్మెల్యేలలో ఆది శ్రీనివాస్ ప్రముఖులు. మంత్రివర్గంలో బీసీల ప్రాతినిధ్యం పెంచాలనే డిమాండ్ ఉన్నందున ఆయనకు కేబినెట్ బెర్త్ ఇవ్వడం ద్వారా ఆ వర్గానికి స్పష్టమైన సంకేతం ఇవ్వవచ్చని భావిస్తున్నారు.

ఎమ్మెల్యేలలో ఈ వర్గానికి చెందిన ప్రముఖుడిగా ఆది శ్రీనివాస్ ఉండటంతో ఆయన అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఇటీవలి రాజకీయ పరిణామాలు, మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ నేపథ్యంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తప్పనిసరిగా మారింది. ఆ ఒక్క పదవిని భర్తీ చేసే క్రమంలోనూ బీసీ కోటాలో ఆది శ్రీనివాస్ పేరును అధిష్ఠానం తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

నిబద్ధత.. క్రమశిక్షణ.. వివాదరహితం..

జడ్పిటీసీ, ఎంపీపీగా వేములవాడ ప్రాంతం నుంచి ఎదిగిన ఆది శ్రీనివాస్ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహిత అనుచరునిగా ముద్రపడ్డారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా అవకాశం కల్పించారు. దీంతో నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువయ్యారు. 2009, 2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసి చెన్నమనేని రమేష్ బాబు చేతిలో ఓటమి పాలైన ఆది శ్రీనివాస్ 2023 నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

మంత్రి పదవి రేసులో ఉన్నా సైతం ప్రభుత్వ విప్ గా అవకాశం కల్పించారు. 2009 నుంచి అనేక ఓటములను ఎదుర్కొన్నప్పటికీ ధైర్యంగా నిలబడి 2023 ఎన్నికల్లో వేములవాడ నుంచి విజయం సాధించడం ఆయన క్షేత్రస్థాయి బలానికి, ఓపికకు నిదర్శనం. రాజకీయ వివాదాలకు దూరంగా ఉంటూ, మచ్చలేని ప్రతిష్టతో పార్టీ నిబంధనలకు కట్టుబడి పనిచేయడం ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది.

కాంగ్రెస్‌లో వర్గపోరు ఎక్కువ ఉన్నా.. రాజకీయ వివాదాలకు దూరంగా ఉంటూ పార్టీ క్రమశిక్షణ దాటని నేతగా గుర్తింపు పొందడం ఆయనకు అదనపు బలంగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రధానంగా రాజన్నసిరిసిల్ల జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు, ముఖ్యంగా బీఆర్‌ఎస్ బలమైన స్థానాల్లో కాంగ్రెస్ పట్టు సాధించేందుకు ఆది శ్రీనివాస్‌ వంటి క్షేత్రస్థాయి నేతకు ప్రాధాన్యత ఇవ్వడం వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందనే చర్చ సాగుతోంది.

ముందున్న ప్రధాన సవాళ్లు..

ఆది శ్రీనివాస్ పేరు ముందంజలో ఉన్నప్పటికీ అధిష్ఠానం ముందు కొన్ని సంక్లిష్టమైన సమీకరణాలు ఉన్నాయి. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి డి.శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రులుగా ఉన్నారు. ఆది శ్రీనివాస్‌కు కూడా చాన్స్ ఇస్తే ఒకే జిల్లా నుంచి నలుగురు మంత్రులవుతారు. దీనివల్ల ప్రాతినిధ్యం లేని ఇతర జిల్లాల నేతల్లో అసంతృప్తి వచ్చే ప్రమాదం ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్‌సాగర్ రావు, తాజాగా మహేష్ కుమార్ గౌడ్(ఎమ్మెల్సీ) వంటి పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు సైతం మంత్రివర్గ బెర్త్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

కీలకంగా మారనున్న ’నిర్ణయం‘

మంత్రివర్గ విస్తరణ లేదా మార్పుల ద్వారా బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేయాలనే నిర్ణయానికి వస్తే మాత్రం ఆది శ్రీనివాస్ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని రాజకీయ వర్గాల విశ్లేషణ. ఆది శ్రీనివాస్‌కు కేబినెట్ బెర్త్ ఇవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీకి కేవలం ఒక నియోజకవర్గ నిర్ణయం మాత్రమే కాదు.. అది బీసీ రాజకీయ సమీకరణాలకు పదును పెట్టే చర్య. అయితే ప్రాంతీయ సమతుల్యతను కాపాడుతూ ఇతర సీనియర్ల అసంతృప్తిని తట్టుకుంటూ అధిష్ఠానం ఆయన వైపు మొగ్గు చూపుతుందా లేక నామినేటెడ్ పదవి లేదా పార్టీపరమైన మరో కీలక బాధ్యతతో సరిపెడుతుందా అనేది వేచి చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>