కలం, స్పోర్ట్స్: వన్డే క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీ అత్యుత్తమ బ్యాటర్ అని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ (Glenn Maxwell) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాక్స్‌వెల్.. మూడు ఫార్మాట్లలో తనకు నచ్చిన బెస్ట్ ప్లేయర్ల పేర్లను బయటపెట్టాడు. వన్డేల్లో కోహ్లీ బ్యాటింగ్ టైమింగ్, గ్యాప్‌లోకి బంతిని తరలించే నైపుణ్యం వేరే లెవెల్ అని కొనియాడాడు. తమపై కోహ్లీ ఆడిన కొన్ని ఇన్నింగ్స్‌లు మైండ్ బ్లోయింగ్ అని ప్రశంసించాడు. వన్డేల్లో 14,941 పరుగులు, 54 సెంచరీలతో కోహ్లీ సాధించిన రికార్డులే అందుకు నిదర్శనమని గుర్తు చేశాడు.
టీ20ల్లో వెస్టిండీస్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్‌ను బెస్ట్‌గా ఎంచుకున్నాడు. రస్సెల్ హిట్టింగ్ పవర్, మెరుపు ఫీల్డింగ్, 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే తీరు అతడిని కంప్లీట్ క్రికెటర్‌గా మార్చాయని పొగిడాడు. ఇక టెస్టుల్లో తన సహచర ప్లేయర్ స్టీవ్ స్మిత్‌ను అగ్రస్థానంలో నిలిపాడు. 2017 భారత పర్యటనలో స్మిత్ వేరే గ్రహంపై బ్యాటింగ్ చేస్తున్నట్లు ఆడి సెంచరీలు బాదాడని, అతడి ఆటను దగ్గరుండి చూడటం తన అదృష్టమని ప్రశంసించాడు.

