సీఎంపై ఆరోపణలు.. బయటపడ్డ సురేఖ సంచలన లేఖ!

కలం, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను తీవ్రంగా అవమానించారని, రాజకీయంగా, పరిపాలనాపరంగా అణచివేస్తున్నారని ఆరోపిస్తూ మాజీ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి రాసిన పది పేజీల సంచలన లేఖలు వెలుగులోకి వచ్చాయి. ఆగస్టు 22వ తేదీన సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్‌లకు, ఆగస్టు 23వ తేదీన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మీనాక్షి నటరాజన్‌లకు విడివిడిగా రాసిన లేఖలను ఆమె తాజాగా మీడియాకు విడుదల చేశారు.

తన శాఖల్లో పరిపాలనాపరమైన జోక్యం జరుగుతోందని, సంబంధిత మంత్రిగా ఉన్న తన ప్రమేయం లేకుండానే సీఎంవో నేరుగా ఆదేశాలు జారీ చేస్తోందని కొండా సురేఖ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల మంత్రిత్వ శాఖల్లో తన పాత్ర నామమాత్రంగా మారిపోయిందని తెలిపారు. యాదాద్రి దేవస్థానం ట్రస్టు బోర్డు ఏర్పాటుపై తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, సమ్మక్క-సారలమ్మ దేవాలయం శాశ్వత అభివృద్ధికి కేటాయించిన నిధులను తనకు తెలియకుండానే ఒక్క రోజు వ్యవధిలోనే ఆర్ అండ్ బీ శాఖకు మళ్లించారని పేర్కొన్నారు.

మంత్రి హోదాను భంగపరిచేలా అనేక చర్యలు తీసుకున్నారని కొండా సురేఖ ఆరోపించారు. తన మాజీ ఓఎస్డీ సుమంత్‌ను ముందస్తు సమాచారం ఇవ్వకుండా పదవి నుండి తొలగించడమే కాకుండా, ఆయనను అరెస్టు చేసేందుకు తన నివాసానికే పోలీసులను పంపడం తీవ్రంగా అవమానించడమేనని గుర్తుచేశారు. అలాగే వరంగల్ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి పనులకు కావాలనే నిధుల మంజూరులో తీవ్ర వివక్ష చూపించారని మండిపడ్డారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి తనకు సమాచారం ఇవ్వకుండా దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారని, దీనిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులను తనకు వ్యతిరేకంగా ఎగదోస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఇబ్బందులకు గురిచేశారని ఆమె లేఖలో తెలిపారు. తన కూతురు సుష్మిత చేసిన వ్యాఖ్యలకు తల్లిగా ఉన్న తనను బాధ్యురాలిని చేస్తూ షోకాజ్ నోటీసు ఇచ్చారని, అయితే ఇలాంటి వ్యాఖ్యలు ఇతర నాయకులు చేసినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కేవలం తాను బీసీ వర్గానికి చెందిన మహిళా మంత్రిని కావడం వల్లే తనపై ఈ తరహా కుట్రలు పన్నుతున్నారని స్పష్టం చేశారు.

తన కుటుంబంపై జరుగుతున్నవన్నీ రాజకీయ దాడులని, ఇవి కాక బయటకు చెప్పని ఘటనలు ఇంకా చాలా ఉన్నాయని సురేఖ పేర్కొన్నారు. తన ఆరోపణలకు సంబంధించిన వీడియోలు, ఇతర ఆధారాలతో కూడిన పెన్‌డ్రైవ్‌ను కూడా లేఖలకు జతచేసి పంపినట్లు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>