కలం, స్పోర్ట్స్: యూఎస్ ఓపెన్‌లో ఊహించని సంచలనం చోటుచేసుకుంది. చైనా టెన్నిస్ ప్లేయర్ బు యున్చావోకెటే (Bu Yunchaokete) 12వ సీడ్ రఫేల్ జోదార్కు షాకిచ్చాడు. 6-2, 6-1, 6-1తో చిత్తు చేశాడు. బు అసలు యూఎస్ ఓపెన్ మెయిన్ డ్రాలో ఉండాల్సిన ఆటగాడు కాదు. క్వాలిఫయింగ్‌లో ఓడిపోయిన అతడు లక్కీ లూజర్‌గా అవకాశం దక్కించుకున్నాడు. థనాసి కొక్కినాకిస్ మ్యాచ్ నుంచి తప్పుకోవడంతో బుకు మెయిన్ డ్రాలో చోటు వచ్చింది. అప్పటికే న్యూయార్క్ నుంచి వెళ్లేందుకు అతడు సిద్ధమయ్యాడు. కానీ చివరి నిమిషంలో పరిస్థితి మారింది.
వర్షం కారణంగా మ్యాచ్ కూడా ఆలస్యమైంది. అయినా బు తన అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాడు. ప్రపంచ 124వ ర్యాంక్‌లో ఉన్న బు.. 12వ సీడ్ జోదార్కు ఒక్క బ్రేక్ పాయింట్ అవకాశం కూడా ఇవ్వలేదు. తొలి సర్వ్‌పై 84 శాతం పాయింట్లు గెలిచాడు. నెట్ వద్ద 13 ప్రయత్నాల్లో 11 పాయింట్లు సాధించాడు. మరోవైపు జోదార్ 37 అన్ఫోర్స్డ్ ఎర్రర్స్ చేశాడు. దీంతో బు మ్యాచ్‌పై పూర్తిగా పట్టు సాధించాడు. ఈ విజయంతో బుకు కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ మెయిన్ డ్రా విజయం దక్కింది.
అంతేకాదు.. యూఎస్ ఓపెన్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ఇటీవల జోదార్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో వేగంగా పైకి వచ్చాడు. కానీ బు ముందు మాత్రం నిలవలేకపోయాడు. తనకు కోల్పోయేది ఏమీ లేదన్న భావనతో కోర్టులోకి వెళ్లానని బు తెలిపాడు. వచ్చిన అవకాశాన్ని ఆస్వాదిస్తూ ఆడానని చెప్పాడు. లక్కీ లూజర్‌గా మొదలైన బు ప్రయాణం ఇప్పుడు యూఎస్ ఓపెన్ రెండో రౌండ్‌కు చేరింది.

