కలం, వనపర్తి: కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల ప్రజాపాలనలో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని వనపర్తి (Wanaparthy) జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శివసేన రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు బీఆర్ఎస్, బీజేపీ నేతలు తాము అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు చేసిన పనులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన 1,000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం ఖిల్లాఘనపురం మండలంలో సోలిపూర్ నుంచి ఖిల్లాఘనపురం వరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శివసేన రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివసేన రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్, బీజేపీ నేతలు రాజకీయ విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో ప్రజా సమస్యలను ఎంతవరకు పరిష్కరించారో బీఆర్ఎస్ నేతలు ముందుగా ప్రజలకు వివరించాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో గత ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రజలు ఇప్పటికే తమ తీర్పిచ్చారని పేర్కొన్నారు.
వాస్తవాలను అంగీకరించకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేసిందో ఆ పార్టీ నేతలు ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై సమాధానం చెప్పకుండా కాంగ్రెస్‌ను విమర్శించడం సమంజసం కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకుని పాలన సాగిస్తోందని తెలిపారు. పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
విద్య, వైద్యం, సంక్షేమ రంగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు ప్రభుత్వ పనితీరును గమనిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని శివసేన రెడ్డి అన్నారు. “కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు.. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. విమర్శలు చేసే ముందు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశారో చెప్పాలి” అని ఆయన ప్రశ్నించారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సాయిచరణ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నవనీత్, జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మం, ఓబీసీ నాయకుడు నందిమల్ల చంద్రమౌళి, యూత్ కాంగ్రెస్ నాయకులు శివకుమార్‌నాయుడు, పాండు సాగర్, ఎన్ఎస్యూఐ నాయకులు జస్వంత్, రోహిత్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

