కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ ధర్నాలు సిగ్గుచేటు: నరేందర్ రెడ్డి

​కలం, కరీంనగర్: పదేళ్ల పాటు ప్రజలను నిలువునా మోసం చేసిన బీఆర్ఎస్ నాయకులు, నేడు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనపై ధర్నాలు చేయడం సిగ్గుచేటని సుడా మాజీ ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి (Komatireddy Narendra Reddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం ముకరంపురలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆ ఫ్లెక్సీని వెంటనే తొలగించాలి..

కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై ప్రజలు సంపూర్ణ సంతృప్తి వ్యక్తం చేస్తుంటే, బీఆర్ఎస్‌కు తమ రాజకీయ భవిష్యత్తు కనిపించకనే రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని నరేందర్ రెడ్డి విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధికారిక క్యాంపు కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని వెంటనే తొలగించాలని, లేకపోతే బీఆర్ఎస్ పదేళ్ల అవినీతి, దోపిడీపై నగరం నలుమూలలా కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు.

ఏం ముఖం పెట్టుకొని ధర్నాలు చేస్తున్నారు..

​కేసీఆర్ కుటుంబ దోపిడీ సొమ్మును ఇంకా లెక్కపెట్టుకుంటూనే ఉన్నారని స్వయంగా ఆయన కూతురు కవిత చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఏ ముఖం పెట్టుకుని బీఆర్ఎస్ నేతలు ధర్నాలు చేస్తున్నారో చెప్పాలన్నారు. తమ హయాంలో ఎంతమందికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇచ్చారో, ఎంతమంది దళితులకు మూడెకరాల భూమి పంచారో సమాధానం చెప్పిన తర్వాతే కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఒకవైపు కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కార్యక్రమంలో పాల్గొంటూ స్వయంగా లబ్ధిదారులకు పథకాలు అందిస్తున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మరోవైపు పథకాలు అందడం లేదని మాట్లాడటం ఆయన నైజానికి అద్దం పడుతోందన్నారు.

కేటీఆర్ హద్దులు దాటి మాట్లాడుతున్నారు..

​ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ హద్దులు దాటి మాట్లాడుతున్నారని, పద్ధతి మార్చుకోకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరని హెచ్చరించారు. అసెంబ్లీలో వెయ్యి నిమిషాలు కూడా మాట్లాడని కేసీఆర్ కోసం ప్రతిపక్ష నేత హోదా పేరిట రూ. 22 కోట్ల ప్రజాధనం వృథా అయిందని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు ఎన్ని డ్రామాలు చేసినా ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నాయకులు కుర్ర పోచయ్య, మామిడి సత్యనారాయణ రెడ్డి, లక్కీరెడ్డి కిరణ్ రెడ్డి, ముక్క భాస్కర్, భారీ, తోట అంజయ్య, షబానా, గుడిపాటి రమణ రెడ్డి, ఫజల్, ఖలీల్, హనీఫ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>