కలం, జగిత్యాల: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలులో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ (BRS Protest) నిర్వహించారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
జగిత్యాల (Jagtial) కొత్త బస్టాండ్ సమీపంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి (Jeevan Reddy), జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ పూలమాలలు వేసి ర్యాలీని ప్రారంభించారు. అక్కడి నుంచి పాత బస్టాండ్ వరకు పార్టీ జెండాలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే ప్లకార్డులతో నిరసన తెలిపారు. కాంగ్రెస్ వైఫల్యాలను నిరసిస్తూ 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ప్రదర్శించారు. “కేసీఆర్ రావాలి.. రేవంత్‌రెడ్డి పోవాలి”, “జై తెలంగాణ” అంటూ చేసిన నినాదాలతో జగిత్యాల పట్టణం మార్మోగింది.
ఇది ప్రజా పాలన కాదు.. ప్రజా వంచన పాలన..
ర్యాలీ అనంతరం జగిత్యాల ఆర్‌డీఓ కార్యాలయం ఎదుట జరిగిన సమావేశంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు గడుస్తున్నా ఆరు గ్యారంటీలు (Six Guarantees), 420 హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో రైతులు, మహిళలు, బీడీ కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగులు, కులవృత్తుల వారికి నిరంతర సంక్షేమ పథకాలు అందేవని గుర్తుచేశారు.
ప్రస్తుత ప్రభుత్వ పాలన ప్రజా పాలన కాదని, ఇది కేవలం ప్రజా వంచన పాలనగా మారిందని మండిపడ్డారు. రైతు భరోసా, రైతు బీమా, పెన్షన్లు, మహిళలకు ఆర్థిక సాయం, ఆటో కార్మికుల భరోసా, బీసీ సబ్‌ప్లాన్, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగాలు వంటి అంశాల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను బొంకిందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలపై చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఆరంభం మాత్రమేనని, రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటం కొనసాగిస్తామని జీవన్ రెడ్డి హెచ్చరించారు.
కేసీఆర్ పథకాలను నిర్వీర్యం చేస్తున్నారు..
జగిత్యాల జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కేసీఆర్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
హామీలు నెరవేర్చే వరకు వదిలేది లేదు..
జగిత్యాల జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ మాట్లాడుతూ.. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, అయితే వెయ్యి రోజులు గడిచినా ఒక్క హామీ కూడా సరిగా నెరవేరలేదని విమర్శించారు. రైతు భరోసా, రైతు బీమా, మహిళలకు రూ.2,500, పెన్షన్ రూ.4 వేలు, ఆటో కార్మికులకు ఆర్థిక భరోసా, విద్యా భరోసా వంటి హామీలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నిరసన (BRS Protest) కార్యక్రమంలో బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Also Read : రాష్ట్రంలో రాబోయేది వైఎస్సార్ యుగం.. రాజగోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Follow Us On: X(Twitter)

