కలం, నేషనల్ డెస్క్: పండుగలు, పెళ్లిళ్ల సీజన్ వేళ సామాన్యుడికి ఇప్పటికే చక్కెర ధరలు చేదుగా మారగా.. ఉల్లి (Onion Prices) మళ్లీ కన్నీళ్లు పెట్టిస్తున్నది. దేశవ్యాప్తంగా రిటైల్ మార్కెట్లలో కిలో ఉల్లి రూ.60 నుంచి రూ.70 వరకు పలుకుతుండటంతో మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ తలకిందులవుతున్నది. గత ఇరవై రోజుల్లోనే ఉల్లి ధరలు అకస్మాత్తుగా మూడు రెట్లు పెరగడంతో కేంద్రం కీలక చర్యలు చేపట్టింది.
మార్కెట్లో సరఫరాను పెంచేందుకు నాసిక్(మహారాష్ట్ర)లోని వ్యూహాత్మక బఫర్ స్టాక్ నుంచి ప్రత్యేక ‘కందా ఎక్స్ప్రెస్’ రైళ్ల ద్వారా ఉల్లిని తరలిస్తున్నది. ఒక్కో రైల్లో 800 టన్నుల ఉల్లిని ఢిల్లీ, చెన్నై, మదురై, ఎర్నాకుళం, గువాహటి కేంద్రాలకు పంపుతున్నది. అలాగే ఢిల్లీకి అత్యవసరంగా 1,000 మెట్రిక్ టన్నుల ఉల్లిని కేటాయించింది. ఈ నిల్వలను రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు కిలో రూ.35కే విక్రయిస్తున్నది. అలాగే జిల్లాకు ఒక మొబైల్ వ్యాన్ చొప్పున ఏర్పాటు చేసి ఇళ్ల వద్దకే తక్కువ ధరకు ఉల్లిని చేరవేస్తున్నది. లక్నో, వారణాసి వంటి 19 ప్రధాన నగరాలకు కూడా ఈ సబ్సిడీ ఉల్లిపాయలను అందిస్తున్నది.
ఉత్పత్తి తగ్గలేదు.. నిల్వలే సమస్య !
నిజానికి ఈసారి దేశంలో ఉల్లి ఉత్పత్తి ఏమాత్రం తగ్గలేదు. గతేడాది 30.76 మిలియన్ టన్నులుగా ఉన్న ఉత్పత్తి.. ఈ ఏడాది 30.73 మిలియన్ టన్నులుగా స్థిరంగానే ఉంది. మరి పంట బాగున్నా మార్కెట్లో కొరత, ధరల మంట ఎందుకు వచ్చిందంటే.. దీనికి అసలు కారణం బఫర్ స్టాక్ లోటే. అత్యవసర సమయాల్లో ధరలను నియంత్రించేందుకు ధరల స్థిరీకరణ నిధి కింద కేంద్రం 0.2 మిలియన్ టన్నుల రబీ ఉల్లిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే నాఫెడ్, ఎన్సీసీఎఫ్ లు కలిసి 0.12 మిలియన్ టన్నులు మాత్రమే సేకరించగలిగాయి. దీంతో 40 శాతం లోటు ఏర్పడింది. సేకరించిన నిల్వల్లోనూ సుమారు 30 శాతం కుళ్లిపోయినట్లు తెలిసింది.
మరోవైపు రబీ సీజన్ లో కురిసిన అకాల వర్షాలతో ఉల్లి నాణ్యత, నిల్వ సామర్థ్యం దెబ్బతిన్నది. నిల్వ చేసిన ఉల్లి పాడైపోయే ప్రమాదాన్ని గుర్తించిన రైతులు ఈసారి సెప్టెంబర్ లో కాకుండా జూన్, జులైలోనే పెద్ద మొత్తంలో ఉల్లిని మార్కెట్ కు తరలించారు. అదే సమయంలో మార్కెట్లో హోల్సేల్ ధరలు పెరగడంతో రైతులు ప్రభుత్వ కొనుగోళ్ల కంటే బహిరంగ మార్కెట్లో విక్రయించడానికే ఆసక్తి చూపారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన బఫర్ స్టాక్ ఆశించిన స్థాయిలో నిండలేదు. అటు ఖరీఫ్ సాగు సమయంలో వర్షాలు ఆలస్యంగా, తగినంతగా కురవకపోవడంతో తదుపరి పంట సాగు ఆలస్యమైంది. సాధారణంగా ఈ సమయానికి మార్కెట్లోకి రావాల్సిన కొత్త పంట ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు.
ధరలు ఎప్పుడు తగ్గుతాయి?
ప్రస్తుతం బఫర్ స్టాక్ ను సబ్సిడీపై విక్రయిస్తూ ధరలను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. మహారాష్ట్ర నుంచి నిల్వలు మార్కెట్కు చేరడంతోపాటు.. కొత్త ఖరీఫ్ పంట సరఫరా పెరిగితే మరో 45 రోజుల్లో ఉల్లి ధరలు సాధారణ స్థాయికి వచ్చే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

