కరీంనగర్‌లో ఆ ఆసుపత్రులను సీజ్ చేయాలి: ఏఐవైఎఫ్

​కలం, కరీంనగర్ బ్యూరో: జిల్లాలో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆసుపత్రులపై అధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ (AIYF Karimnagar) జిల్లా ప్రధాన కార్యదర్శి భావండ్లపెల్లి యుగంధర్ డిమాండ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రులను తక్షణమే సీజ్ చేయాలన్నారు. జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల సమస్యలు, ప్రజా ఆరోగ్యానికి సంబంధించి పలు ముఖ్యమైన డిమాండ్లతో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ​

ఫైర్ సేఫ్టీ లేకపోతే ఎలా..

ఈ సందర్భంగా భావండ్లపెల్లి యుగంధర్ మాట్లాడుతూ.. ఆసుపత్రి అంటే ప్రజల ప్రాణాలు కాపాడే ప్రదేశమని, అలాంటి చోట కనీస ఫైర్ సేఫ్టీ నిబంధనలు లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగితే రోగులు, చిన్నపిల్లలు, వృద్ధులు, ఆసుపత్రి సిబ్బంది తీవ్ర ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫైర్ సేఫ్టీ అనేది కేవలం ఒక సర్టిఫికెట్ కోసం పెట్టుకునే నిబంధన కాదని, అది ప్రజల ప్రాణాలకు సంబంధించిన బాధ్యత అని స్పష్టం చేశారు.

వెంటనే ప్రత్యేక తనిఖీలు చేపట్టాలి..

కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో అధికారులు వెంటనే ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని, ఫైర్ NOC, అగ్నిమాపక పరికరాల పనితీరు, అత్యవసర నిష్క్రమణ (Emergency Exit) మార్గాలను పరిశీలించాలని డిమాండ్ చేశారు. భద్రతా ప్రమాణాలు పాటించని ఆసుపత్రులను చట్టప్రకారం సీజ్ చేయాలన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న CMRF (ముఖ్యమంత్రి సహాయ నిధి),  ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

వాటిపై చర్యలు తీసుకోవాలి..

ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు వైద్యం అందించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కనీస పార్కింగ్ సౌకర్యం లేకుండా ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తున్న ఆసుపత్రులపై నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని, ​నిర్వహించిన తనిఖీల వివరాలను ప్రజలకు పారదర్శకంగా వెల్లడించాలని, ​అధికారులు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల ఒత్తిళ్లకు లొంగకుండా, ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు జువ్వాజి తిరుపతి, మహేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>