వ‌రంగ‌ల్‌లో సీఎంఆర్ బ‌కాయిలు.. క‌ఠిన చ‌ర్య‌ల‌కు సిద్ధం

కలం, వరంగల్‌ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్లర్లకు ఇచ్చిన ధాన్యం సీఎంఆర్‌ (CMR)గా తిరిగిరాలేదు. బకాయిలేమో కొండలా పేరుకుపోయాయి. ఉమ్మడి వరంగల్‌ (Warangal) జిల్లాలో 2022–23 యాసంగి సీజన్‌కు సంబంధించిన సుమారు రూ.230 కోట్ల విలువైన సీఎంఆర్‌ ఇప్పటికీ రాలేదు. మూడేళ్లు దాటినా బకాయిలు పూర్తిస్థాయిలో రికవరీ కాకపోవడం, గడువుల మీద గడువులు ఇవ్వడం.. ఇలా మొత్తంగా సీఎంఆర్ వ్యవహారంపై పలు అనుమానాలు, విమర్శలకు తావిస్తోంది.

ఏ జిల్లా వాటా ఎంత?

ఉమ్మడి జిల్లాలో బకాయిల లెక్కల్లో భాగంగా హనుమకొండ జిల్లాలో రూ.23 కోట్లు, వరంగల్‌ జిల్లాలో రూ.68 కోట్లు, జనగామ జిల్లాలో రూ.8 కోట్లు, భూపాలపల్లి జిల్లాలో రూ.27 కోట్లు, ములుగు జిల్లాలో రూ.15 కోట్లు, మహబూబాబాద్‌ జిల్లాలో రూ.98 కోట్లు.. ఇలా మొత్తంగా సుమారు రూ.230 కోట్ల విలువైన సీఎంఆర్‌ బకాయిలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో మహబూబాబాద్‌ జిల్లా వాటానే అధికంగా ఉండటంతో ఇప్పుడు విస్తృత చర్చకు పెట్టింది. అయితే.. తాజాగా సివిల్‌ సప్లైస్‌ అధికారులు దూకుడు పెంచారు. ‘మిషన్‌ కే–100’లో భాగంగా రైస్‌ మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు, రికార్డుల పరిశీలన చేపట్టారు. బకాయిల పెండింగ్లో 18 కేసులు నమోదు చేసి, 12 మందిని అరెస్ట్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో మిగిలిన బకాయిదారుల్లో కలవరం మొదలైంది. ఇంకా ఎవరెవరిపై కేసులు? అరెస్టులు? అనేవి ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

తనిఖీలతో తేలుతున్న బొక్కలు

మిల్లుల్లోని స్టాక్‌, ధాన్యం స్వీకరణ, సీఎంఆర్‌ బియ్యం అప్పగింత, రికార్డుల్లోని వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మిల్లుల్లోని ధాన్యాన్ని స్వాధీనం చేసుకుని థర్డ్‌ పార్టీ ద్వారా అమ్మేందుకు ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే ఆ ప్రక్రియలోనూ పలు ఇబ్బందులు ఎదురైనట్లు సమాచారం. ప్రభుత్వం అప్పగించిన ధాన్యం ఎంత? బియ్యంగా తిరిగి రావాల్సింది ఎంత? వచ్చింది ఎంత? ఇందులో బకాయి ఎంత? ఇప్పటి వరకు ఎంత రికవరీ చేశారు? ఇలాంటి లెక్కలన్నీ పూర్తిగా తేలితేనే అసలు బకాయి ఎంతనేది స్పష్టమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

పాత లెక్కుల తేల్చకుండానే..

కేసులు, అరెస్టులతో చర్యల్లో వేగం పెరిగిందనడానికి సంకేతమే అయినా.. ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయలు పూర్తిగా రికవరీ అయినప్పుడే అసలు లక్ష్యం నెరవేరినట్టవుతుందనే అభిప్రాయాలూ లేకపోలేదు.
రూ.230 కోట్ల బకాయిల్లో ఇప్పటివరకు ప్రభుత్వ ఖజానాకు చేరిన మొత్తం ఎంత? అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. మరోవైపు పాత సీఎంఆర్‌ బకాయిలు పూర్తిగా పరిష్కారం కాకుండానే మిల్లింగ్‌ వ్యవస్థ కొనసాగుతోంది. పాత లెక్కలు తేల్చకుండా కొత్తగా ధాన్యం అప్పగిస్తే భవిష్యత్తులో సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే డిఫాల్ట్‌ మిల్లర్లపై స్పష్టమైన విధానం, పాత బకాయిలకు కాలపరిమితి, వసూళ్లకు కఠినమైన కార్యాచరణ అవసరమనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ప్రజాధనానికి చెందిన అంశంగా..

ఉమ్మడి జిల్లాలో బకాయిల వ్యవహారం మిల్లర్ల సమస్యగా కాకుండా ప్రభుత్వ ధాన్యం, ప్రజాధనం రక్షణకు సంబంధించిన అంశంగా మారింది. మహబూబాబాద్‌ జిల్లాలో మొదలైన అరెస్టులు మిగిలిన జిల్లాలకూ విస్తరిస్తాయా? బకాయిదారుల ఆస్తులు జప్తు చేస్తారా? ఇన్నాళ్లుగా పెండింగ్‌లోని రూ.230 కోట్లలో ఎంత మొత్తాన్ని ప్రభుత్వం రాబట్టగలుగుతుంది? ఈసారి కూడా గడువే గెలుస్తుందా? లేక ప్రభుత్వ ధాన్యం విలువ పూర్తిగా ఖజానాకు చేరుతుందా? ఇదే ఇప్పుడు ఉమ్మడి జిల్లా ప్రజల్లోంచి వస్తున్న ప్రశ్నలు. దీనిపై అధికార యంత్రంగా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

గడువుతో సరి.. రికవరీ ఎక్కడ?

బకాయిలు చెల్లించాలని అధికారులు పలుమార్లు గడువులు విధించారు. ముగిసిన తర్వాత కూడా జరిమానాతో చెల్లించేందుకు మరో చాన్స్ ఇచ్చారు. తాజాగా బకాయిలను చెల్లించేందుకు గడువు విధిస్తూ, ఇకపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కానీ, గడువు ముగిసిన ప్రతిసారీ చర్యల కంటే మరో చాన్స్ ఇవ్వడం ఎందుకు? ఇదే ఇప్పుడు అధికారులపై వినిపిస్తున్న ప్రధాన విమర్శ. ఇకపై బకాయిలు చెల్లించని మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్‌ కింద ఆస్తుల జప్తు చేస్తామని అధికారులు ప్రకటించడం ప్రస్తుతం కీలక పరిణామంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>