కలం, తెలంగాణ బ్యూరో : ఆనాడు పీవీ నరసింహారావు తీసుకొచ్చిన గురుకుల విద్యాసంస్థలే నేటి నవోదయ విద్యాలయాలకు స్ఫూర్తిగా నిలిచాయని పేర్కొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)..పేదలకు విద్యను అందించడం మాత్రమే కాకుండా, ప్రపంచంతో పోటీ పడే స్థాయికి వారిని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఫిన్లాండ్ (Finland) విద్యా విధానాన్ని అధ్యయనం చేసి వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులతో గురువారం నిర్వహించిన ఇంటరాక్షన్‌లో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థిపై రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.1.08 లక్షలు ఖర్చు చేస్తోందని తెలిపారు. అయినప్పటికీ తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలను ఎందుకు ఆశ్రయిస్తున్నారో ఆలోచించాలని సూచించారు. గత పదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్‌ఔట్లు అధికంగా ఉండేవని, ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందని చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో అదనంగా లక్ష మంది విద్యార్థులు చేరిన విషయాన్ని గుర్తుచేశారు.
నాణ్యమైన విద్య, పౌష్టికాహారమే లక్ష్యం
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. అసలైన వెనుకబాటుతనం ఆర్థిక పరిస్థితి కాదని, విద్య లేకపోవడమేనని పేర్కొన్నారు. విద్యతో పాటు నైపుణ్యాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని అన్నారు. ఇంగ్లిష్ మాత్రమే విజయానికి మార్గం కాదని, చైనా తన మాతృభాషతోనే ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగిందని గుర్తు చేశారు. ఇకపై జర్మనీ, జపాన్, సింగపూర్ వంటి దేశాల విద్యా విధానాలను అధ్యయనం చేసి వాటి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. 12వ తరగతి పూర్తయ్యే సమయానికి విద్యార్థులకు ప్రపంచంపై సమగ్ర అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని చెప్పారు.
ఉపాధ్యాయుల సమస్యలు నా బాధ్యత
ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిదేనని, ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థుల ప్రయోజనాల కోసం ఎక్కువగా పోరాడాలని సీఎం (CM Revanth Reddy) సూచించారు. రాబోయే ఐదేళ్లలో తెలంగాణ ప్రభుత్వ విద్యా వ్యవస్థను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. వచ్చే విద్యా సంవత్సరానికి అవసరమైన సంస్కరణలపై డిసెంబరు నాటికి నివేదిక సిద్ధం చేయాలని, ప్రతి మండలాన్ని ఒక క్లస్టర్‌గా తీసుకుని కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చినందుకు రాజీనామా చేయాలా?
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలు అందుతున్నాయని, బదిలీలు చేశామని, ప్రమోషన్లు ఇచ్చామని, డీఎస్సీ నిర్వహించామని సీఎం గుర్తు చేశారు. తల్లిదండ్రులకు ఆర్థిక భారాన్ని తగ్గించేలా పిల్లలకు స్కూళ్ళలోనే బ్రేక్ ఫాస్ట్, కొత్త మెనూతో నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామని గుర్తుచేశారు. “విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి వైదొలగాలని కొందరు మాట్లాడుతున్నారు.
మంచి పర్ఫామెన్స్ ఇచ్చినందుకు రాజీనామా చేయాలా? నర్సరీ నుంచి 12 వతరగతి వరకు బ్రేక్‌ఫాస్ట్ ఇస్తున్నందుకా? టీచర్ల నియామకం, పదోన్నతులు సక్రమంగా నిర్వహించినందుకా? ఐటీఐలను ఏటీసీలుగా మార్చినందుకా? విద్యార్థులకు స్కిల్స్ అందించేందుకు స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినందుకా? ప్రపంచంలోనే సక్సెస్ అయిన కార్పొరేట్ సంస్థల యజమానులను స్కిల్స్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ గా నియమించినందుకా?..” అని ప్రశ్నించారు. పిల్లలు వారి తల్లిదండ్రుల దగ్గర కంటే ఎక్కువ సమయం ఉపాధ్యాయుల దగ్గరే ఉంటారని, పేరెంట్స్‌కు ఎంత బాధ్యత ఉంటుందో టీచర్లకూ అంతే బాధ్యత ఉంటుందన్నారు.
టీచర్లకు విదేశీ శిక్షణ
ప్రతి ఏడాది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల తరహాలో ఉపాధ్యాయులను కూడా విదేశాలకు పంపి అక్కడి విద్యా విధానాలను అధ్యయనం చేసే అవకాశం కల్పిస్తామని సీఎం ప్రకటించారు. ఇందుకు అవసరమైన ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఈ చర్యలు రాజకీయాల కోసం కాదని, రాష్ట్ర విద్యా వ్యవస్థను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే సంకల్పంతో చేపడుతున్నవేనని స్పష్టం చేశారు. చివరగా, నాణ్యమైన విద్యతో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెట్టాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
Read Also: బొగ్గు మాఫియాపై ఈడీ పంజా.. 600 కోట్ల ఆస్తులు సీజ్!
Follow Us On : WhatsApp

