నామినేటెడ్ పదవులేవీ?.. కాంగ్రెస్‌ క్యాడర్ నిరాశ

క‌లం, మెద‌క్ బ్యూరో: మెద‌క్ (Medak) జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పూర్తిగా నిరాశలో ఉన్నారు. తెలంగాణలో ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు గడుస్తున్నా.. జిల్లాలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ మాత్రం ముందుకు సాగ‌డంలేదు. దీంతో, దశాబ్దాల కాలంగా పార్టీ జెండాను భుజాన ఎత్తుకుని, ఎన్నో కష్టనష్టాలకోర్చిన స్థానిక నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. వ్య‌వ‌సాయ మార్కెట్ క‌మిటీ, దేవాల‌యాల కమిటీ ఛైర్మన్ పదవులతో పాటు జిల్లా స్థాయి నియామకాలు నిలిచిపోవడంతో నిరాశకు లోనవుతున్నారు.

చాలా కమిటీలు ఖాళీగానే…

ఉమ్మడి మెదక్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడానికి జిల్లా నేతలు, కార్యకర్తలు కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పదవులు తమకు దక్కుతాయని ఆశించారు. మెద‌క్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఉన్న ప్ర‌ఖ్యాత ఏడుపాయ‌ల వ‌న‌దుర్గ అల‌య క‌మిటీ ఇంతవరకు నియామకం కాలేదు. వీటితో పాటు నర్సాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ, శివ్వంపేట మండలం చాకరిమెట్ల హనుమాన్ దేవస్థానం, సికింద్లాపూర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, కౌడిపల్లి మండలం తునికి నల్లపోచమ్మ ఆలయం, హత్నూర మండలం పలుగు పోచమ్మ ఆలయాల్లో ఇంతవరకు నూతన కమిటీలను నియమించలేదు.

మార్కెట్ కమిటీ, ఆలయ పాలక మండళ్ల పదవీకాలం సాధారణంగా రెండేళ్లు ఉంటుంది. ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే వీటికి నియామకాలు చేపట్టి ఉంటే, ఇప్పటికే ఒక దఫా పదవీ కాలం పూర్తయి.. రెండో విడతలో మరికొందరికి అవకాశాలు దక్కేవి. కానీ, రెండేళ్లు దాటినా ఛైర్మన్, వైస్ ఛైర్మన్, డైరెక్టర్లు, సభ్యుల పదవులను భర్తీ చేయకపోవడంతో పదవులపై ఆశలు పెట్టుకున్న ద్వితీయ శ్రేణి నాయకులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.

ఆలస్యానికి వారే కారణమా..?

పదవుల భర్తీ ఆలస్యం కావడం వెనుక మెద‌క్ ఎమ్మెల్మే మైనంప‌ల్లి రోహిత్ , న‌ర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆవుల రాజిరెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ చొరవ లేకపోవడమే కారణమని పార్టీ శ్రేణులు బహిరంగంగానే ఆరోపిస్తున్నాయి. నామినేటెడ్ పదవుల భర్తీ వలన స్థానికంగా వర్గ పోరు లేదా అసంతృప్తులు వస్తాయని భావిస్తే.. చొరవ తీసుకుని సర్దిచెప్పాలి గానీ, పోస్టులే భర్తీ చేయకపోవడమేంటన్నారు.

ప‌దేళ్ల పాటు అధికారం లేకపోయినా, పార్టీ మారాలని ఒత్తిడి తెచ్చినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీని నమ్ముకుని ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలో ఉండటంతో.. అవకాశాలు వస్తాయని భావించినా, పట్టించుకోవడం లేదంటున్నారు. ఇప్ప‌టికైనా పార్టీని బలోపేతం చేసేలా అన్ని రకాల నామినేటెడ్ ప‌దవుల భ‌ర్తీ చేయాల‌ని కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>