భూముల రీ సర్వేను వేగవంతం చేయాలి: కలెక్టర్

కలం, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో : అడ్డాకల్ మండలంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Collector Khushboo Gupta) పర్యటించి పొన్నకల్ గ్రామంలో జరుగుతున్న నాన్ కెడస్టల్ భూముల రీ-సర్వే పనులను పరిశీలించారు. అనంతరం మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయంలో పెండింగ్ ఫైళ్ళను తనిఖీ చేశారు.

ముందుగా పొన్నకల్ గ్రామాన్ని సందర్శించి గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే పనులను పరిశీలించి, గ్రామ సరిహద్దుల నిర్ధారణ ప్రక్రియను అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పొన్నకల్–రాచాల గ్రామాల మధ్య ఉన్న సరిహద్దు రేఖ (బౌండరీ లైన్) రీ-సర్వే ప్రక్రియను కలెక్టర్ మ్యాప్ ద్వారా ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా రాచాల, పొన్నకల్ గ్రామాల రైతులు, గ్రామస్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రీ-సర్వే ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని, గ్రామస్థుల సహకారంతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.రీ-సర్వే సందర్భంగా తలెత్తే సాంకేతిక సమస్యలు, గ్రామస్తులకు ఉన్న సందేహాలను వెంటనే నివృత్తి చేయాలని, పూర్తి అవగాహన కల్పిస్తూ ఎలాంటి వివాదాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

పొన్నకల్ గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయాన్ని కలెక్టర్ ఖుష్బూ గుప్తా సందర్శించారు. ఆలయం ముందు ఉన్న కోనేరు శిథిలావస్థకు చేరుకోవడంతో, దానిని పునర్నిర్మించాలని గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు జిల్లా కలెక్టర్‌ను కోరారు. కోనేరు పరిస్థితిని పరిశీలించిన కలెక్టర్, సంబంధిత అధికారులతో చర్చించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అనంతరం అడ్డాకల్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్, భూభారతి, మీ సేవ, సాధారణ దరఖాస్తులకు సంబంధించిన పెండింగ్ ఫైళ్లపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా 60 రోజులకు పైగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించి ప్రజలకు సకాలంలో సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్. బి హరిప్రియ,అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనీ సాయి శివాని, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏ.డి. అశోక్, అడ్డాకల్ తహసీల్దార్ కె. శంకర్, మండల స్థాయిలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>