కలం, సత్తుపల్లి: సత్తుపల్లికి (Sathupalli) చెందిన 100 మంది ఆటో డ్రైవర్లకు రూ.4 లక్షల చొప్పున ఉచిత ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు న్యూ స్టార్ సంస్థల అధినేత డాక్టర్ సురేష్ రామాల(Dr Suresh Ramala) ప్రకటించారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం న్యూ స్టార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, న్యూ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో సత్తుపల్లి ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్‌లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ శిబిరంలో ఆటో డ్రైవర్‌లు, వారి కుటుంబ సభ్యులు, ఆర్టీసీ కార్మికులకు ఉచిత వైద్య పరీక్షలు, ఆరోగ్య సేవలు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ సురేష్ రామాల మాట్లాడుతూ.. నిత్యం ప్రజా సేవలో ఉండే ఆటో డ్రైవర్‌లు, ఆర్టీసీ కార్మికుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాద బీమా సదుపాయం కల్పించినట్లు తెలిపారు.
అలాగే ఆటో డ్రైవర్‌ల కుటుంబ సభ్యులకు ప్రతి బుధవారం న్యూ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఉచిత ఓపీ సేవలు అందిస్తామని వెల్లడించారు. తన సొంత ఖర్చులతో ఆటో డ్రైవర్‌లకు ఉచితంగా యూనిఫాంలను కూడా పంపిణీ చేశారు. ఆటో డ్రైవర్ యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఉచిత ప్రమాద బీమాతో పాటు వైద్య సేవలు, యూనిఫాంలు అందించిన డాక్టర్ సురేష్ రామాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

