కలం, స్పోర్ట్స్ : భారత మాజీ ఓపెనర్, కోచ్ వసీమ్ జాఫర్ (Wasim Jaffer) క్రికెట్ అభిమానులతో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దూరదర్శన్‌లో ప్రసారమైన ‘ది గ్రేట్ ఇండియన్ క్రికెట్ షో’లో పాల్గొన్న ఆయన స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ప్రతిభతో పాటు వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ నిబద్ధతను ప్రశంసించారు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టుకు పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్న జాఫర్, క్రిస్ గేల్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర ఘటనను వెల్లడించారు. ఓ వేలంలో ప్రారంభ దశలో ఏ ఫ్రాంచైజీ కూడా గేల్‌ను కొనుగోలు చేయలేదని, చివరి రౌండ్లో పంజాబ్ కింగ్స్ అతడిని తీసుకుందని తెలిపారు.
అంతటి స్టార్ ఆటగాడికి ఆ పరిణామం కొంత అసంతృప్తిని కలిగించినప్పటికీ, గేల్ దానిని సవాలుగా స్వీకరించాడని జాఫర్ చెప్పారు. ఆ సీజన్లో భారీగా పరుగులు చేసి తన సత్తా చాటాడని పేర్కొన్నారు. బయటకు ప్రశాంతంగా కనిపించినా, గేల్ ఎంతో కష్టపడే, నిబద్ధత కలిగిన ఆటగాడని కొనియాడారు. ఇక కేఎల్ రాహుల్ (KL Rahul) గురించి మాట్లాడుతూ, మూడు ఫార్మాట్లలోనూ రాణించే అరుదైన ప్రతిభ కలిగిన ఆటగాడని జాఫర్ అన్నారు. రాహుల్‌లో అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్ ఉందని, అతను తన సామర్థ్యంతో దేశానికి, ఐపీఎల్ జట్టుకు మరిన్ని పరుగులు అందించగలడని అభిప్రాయపడ్డారు. టాలెంట్, నైపుణ్యం పరంగా కేఎల్ రాహుల్ విరాట్ కోహ్లీకి (Virat Kohli) ఏమాత్రం తీసిపోడని జాఫర్ పేర్కొన్నారు. అయితే కోహ్లీ విజయాలలో అతడి ప్రత్యేకమైన మానసిక దృఢత్వం కీలక పాత్ర పోషిస్తుందని, అదే ఇద్దరు ఆటగాళ్ల మధ్య ప్రధాన వ్యత్యాసమని వివరించారు.

