50 ఏళ్ల నిరీక్షణకు ముగింపు? హర్మన్‌ప్రీత్ లక్ష్యం అదే!

కలం, స్పోర్ట్స్ : భారత హాకీ జట్టు మరో చారిత్రక ఘట్టానికి అడుగు దూరంలో ఉంది. 50 ఏళ్ల ప్రపంచకప్(Hockey World Cup)పతక నిరీక్షణకు తెరదించడమే తమ ప్రధాన లక్ష్యమని భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్(Harmanpreet Singh) స్పష్టం చేశాడు. టోక్యో ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల తర్వాత పతక కరవును ముగించిన నమ్మకంతోనే ప్రపంచకప్ బరిలోకి దిగుతున్నామని ఆయన తెలిపారు. ఆగస్టు 15 నుంచి 30 వరకు నెదర్లాండ్స్, బెల్జియం వేదికలుగా జరిగే ప్రపంచకప్ కోసం జట్టు పూర్తిగా సిద్ధమైందని చెప్పారు. ప్రపంచకప్‌లో ఒత్తిడి లేదని, దేశానికి మరో గొప్ప విజయాన్ని అందించాలనే బాధ్యతతో ఆడతామని హర్మన్‌ప్రీత్ పేర్కొన్నారు.

భారత్ ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే 1975లో ప్రపంచకప్‌ను గెలుచుకుంది. అంతకుముందు 1971లో కాంస్యం, 1973లో రజత పతకాలను సాధించింది. ఆ తర్వాత ప్రపంచకప్‌లో మళ్లీ పతకం సాధించలేకపోయింది. ప్రస్తుతం జట్టులోని పలువురు సీనియర్ ఆటగాళ్లకు ఇది చివరి ప్రపంచకప్ అయ్యే అవకాశం ఉందని, అందుకే తమ ప్రదర్శనతో యువ ఆటగాళ్లకు ఆదర్శంగా నిలవాలని భావిస్తున్నట్లు హర్మన్‌ప్రీత్ తెలిపారు. ఇటీవల యూరప్‌లో జరిగిన ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్‌లో నెదర్లాండ్స్, జర్మనీ వంటి బలమైన జట్లపై విజయాలు సాధించడం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందన్నారు.

చిన్న తప్పిదానికీ తావులేదు

ప్రపంచకప్‌లో ప్రతి మ్యాచ్ కీలకమని, చిన్న తప్పిదం కూడా భారీ ప్రభావం చూపుతుందని హర్మన్‌ప్రీత్ హెచ్చరించారు. ప్రస్తుతం భారత జట్టు కేవలం పెనాల్టీ కార్నర్లపైనే ఆధారపడటం లేదని, ఫీల్డ్ గోల్స్‌లోనూ మెరుగైన ప్రదర్శన ఇస్తోందని చెప్పారు. ఫార్వర్డ్ లైన్ సమన్వయంపై పూర్తి నమ్మకం ఉందని, ప్రపంచకప్‌లో అరంగేట్రం చేయనున్న యువ ఆటగాళ్లకు అగ్రశ్రేణి జట్లపై ఆడిన అనుభవం ఉందని తెలిపారు. ఒత్తిడికి గురికాకుండా సహజమైన ఆటను కొనసాగించాలని వారికి సూచించినట్లు వెల్లడించారు.

పాకిస్థాన్ మ్యాచ్‌పై ఆసక్తి

గ్రూప్ దశలో పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌పై కూడా హర్మన్‌ప్రీత్ స్పందించారు. భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌కు ఎప్పుడూ ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని, అయితే భావోద్వేగాలకు లోనుకాకుండా జట్టు లక్ష్యంపై దృష్టి పెడతామని చెప్పారు. ప్రపంచకప్ అనంతరం ఆసియా క్రీడలు జరగనున్నాయని, అక్కడ స్వర్ణ పతకం సాధిస్తే 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత లభిస్తుందని తెలిపారు. ప్రపంచకప్ తర్వాత త్వరగా కోలుకుని ఆసియా క్రీడల్లోనూ అదే జోరును కొనసాగించడమే తమ తదుపరి లక్ష్యమని హర్మన్‌ప్రీత్ సింగ్ వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>