మంత్రి ఉత్తమ్ రాజీనామా చేయాలి: ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

కలం, నల్లగొండ: నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి శాఖపై ఎలాంటి అవగాహన లేదని.. చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagadish Reddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన మంత్రి పదవికి అనర్హుడని.. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు.

చర్చకు రావాలని సవాల్..

కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్‌కు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. దమ్ముంటే రావాలని.. కన్నెపల్లి పంపులు, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల ద్వారా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా రైతులకు నీళ్లు ఇవ్వొచ్చని ఆధారాలతో సహా నిరూపిస్తానని సవాల్ విసిరారు.

గోదావరి నీళ్లు కళ్ల ముందే సముద్రంలోకి వృథాగా పోతున్నా, వాటిని లిఫ్ట్ చేసి వినియోగించుకునే కనీస ఆలోచన ప్రభుత్వానికి లేదని ధ్వజమెత్తారు. ఇప్పటికే దాదాపు 150 టీఎంసీలు సముద్రం పాలు చేశారని ఆరోపించారు.

సాగర్ నీరు ఏపీకి..

బీఆర్ఎస్ హయాంలో కరువు కాలంలోనూ నాగార్జునసాగర్ కింద రైతులకు కంటికి రెప్పలా సాగునీరు అందించామని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గుర్తుచేశారు. కానీ నేడు సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 50 టీఎంసీల నీటిని తరలిస్తున్నా.. ప్రభుత్వం నోరు మెదపడం లేదని ఆరోపించారు.

మిషన్ భగీరథ ద్వారా కూడా తాగునీటి సరఫరాను కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా చేయడం లేదని జగదీష్ రెడ్డి విమర్శించారు. ఫలితంగా నల్లగొండతో పాటు రాజధాని హైదరాబాద్‌కు కూడా త్వరలోనే మంచినీటి ఎద్దడి వచ్చే ప్రమాదం పొంచి ఉందన్నారు.

2014కు ముందు నాటి పరిస్థితులు..

మరో 15 రోజుల్లో రిజర్వాయర్లలోని నీళ్లు పూర్తిగా అయిపోయే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హెచ్చరించారు. 2014కు ముందు ఉన్న దుర్భిక్ష పరిస్థితులను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ రాష్ట్రానికి తీసుకొచ్చిందని విమర్శించారు.

రైతులకు రోజుకు 12 గంటల విద్యుత్ కూడా సక్రమంగా ఇవ్వకపోయినా.. సమీక్షల పేరుతో ప్రభుత్వం కేవలం ‘షో’ చేస్తోందన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో లేవని, ఇంకుడు గుంతల పేరుతో కాలయాపన చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>