కలం, స్పోర్ట్స్ : ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup-2026) ఫైనల్‌కు ముందు స్పెయిన్ యువ స్టార్ లామిన్ యమాల్‌పై అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ (Lionel Messi) కీలక వ్యాఖ్యలు చేశాడు. అతను చరిత్ర సృష్టించే అవకాశం ఉందని చెప్పినా, అది తమపై జరగనివ్వబోమని స్పష్టం చేశాడు. ఆదివారం న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, యూరోపియన్ ఛాంపియన్ స్పెయిన్‌తో ఫైనల్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో యమాల్ మరో అరుదైన ఘనతను అందుకునే అవకాశముంది.
టామ్ బ్రాడీతో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన మెస్సీ (Lionel Messi), యమాల్ అద్భుతమైన ఆటగాడని తెలిపాడు. బార్సిలోనా కోసం ఆడుతున్నందున అతని ఆటను దగ్గరగా గమనిస్తున్నానని చెప్పాడు. అయితే ఈసారి అతను చరిత్ర సృష్టించకుండా అర్జెంటీనా శక్తిమేర ప్రయత్నిస్తుందని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా మెస్సీ, యమాల్‌కు సంబంధించిన వైరల్ ఫొటోను కూడా గుర్తు చేసుకున్నాడు. దాదాపు 20 ఏళ్ల క్రితం బార్సిలోనాలో జరిగిన చారిటీ ఫోటోషూట్‌లో చిన్నారి యమాల్‌కు యువ మెస్సీ స్నానం చేయిస్తున్న చిత్రం ఇటీవల మళ్లీ వైరల్ అయింది.
ఇప్పుడు అదే ఇద్దరూ వరల్డ్ కప్ ఫైనల్లో ప్రత్యర్థులుగా తలపడటం ఆశ్చర్యంగా అనిపిస్తోందని ఆయన చెప్పినట్లు వెల్లడైంది. ఆ ఫొటో తీసిన ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్ జోన్ మాన్‌ఫోర్ట్ కూడా అప్పట్లో దాని ప్రాధాన్యం ఊహించలేదని తెలిపాడు. ఇప్పుడు ఆ చిత్రం ఫుట్‌బాల్ ప్రపంచంలో పెద్ద చర్చగా మారిందని చెప్పాడు. ఫైనల్లో తమ జట్టు మంచి ఆట ఆడాలని, స్పెయిన్‌తో పాటు యమాల్ మాత్రం గుర్తుండిపోయే ప్రదర్శన చేయకూడదని మెస్సీ అభిప్రాయపడ్డాడు.

