కలం, స్పోర్ట్స్: టీమిండియా మహిళల టీ20 జట్టుకు భవిష్యత్ కెప్టెన్లు ఎవరనే చర్చకు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ (Mithali Raj) ఆసక్తికర సమాధానం ఇచ్చారు. షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్ ఇద్దరూ నాయకత్వానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారని ఆమె అభిప్రాయపడ్డారు. హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో భారత్ వరుసగా రెండు టీ20 ప్రపంచకప్‌లలో గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. అయితే గత ఏడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌ను హర్మన్ సారథ్యంలోనే భారత్ గెలుచుకుంది. కానీ 2018 నుంచి టీ20 జట్టును నడిపిస్తున్న ఆమెకు ఇప్పటికీ టీ20 ప్రపంచకప్ మాత్రం అందలేదు.
ప్రస్తుతం ఆసియా కప్, ఆసియా క్రీడల్లో కూడా హర్మన్‌ప్రీత్‌నే కెప్టెన్‌గా కొనసాగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఓ అభిమాని ప్రశ్నకు మిథాలీ స్పందించారు. షెఫాలీకి మద్దతు ఇవ్వడం అంటే స్మృతి మంధానా నాయకత్వ సామర్థ్యంపై సందేహం కాదని ఆమె స్పష్టం చేశారు. సుదీర్ఘ ఫార్మాట్లలో భారత జట్టును నడిపించేందుకు స్మృతి పూర్తిగా సరైన నాయకురాలని మిథాలీ పేర్కొన్నారు.
అయితే టీ20 భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని షెఫాలీ గురించి మాట్లాడుతున్నానని వివరించారు. షెఫాలీ చాలా చిన్న వయసులోనే జాతీయ జట్టులో స్థానం సంపాదించిందని గుర్తు చేశారు. ఆమె దూకుడైన బ్యాటర్ మాత్రమే కాకుండా బౌలింగ్ కూడా చేస్తుందని చెప్పారు. 2023లో భారత్‌కు తొలి అండర్-19 మహిళల ప్రపంచకప్ అందించిన కెప్టెన్ కూడా షెఫాలీయేనని గుర్తు చేశారు. నాయకత్వం ఒక్కరోజులో రాదని, మైదానంలోనే ఎదుగుతుందని మిథాలీ అభిప్రాయపడ్డారు.
జెమీమా రోడ్రిగ్స్‌పైనా మిథాలీ (Mithali Raj) ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలోని పలు టీ20 లీగ్‌ల్లో ఆమె ఆడుతోందని చెప్పారు. గత ప్రపంచకప్‌లో ఆశించిన ప్రదర్శన చేయకపోయినా, అలాంటివి ఏ ఆటగాడికైనా జరుగుతాయని అన్నారు. జెమీమా జట్టు కోసం ఆడే క్రికెటర్ అని మిథాలీ కొనియాడారు. స్పిన్‌ను అద్భుతంగా ఆడుతుందని చెప్పారు. ఫీల్డింగ్‌తో ప్రతి మ్యాచ్‌లో 20 నుంచి 25 పరుగులు కాపాడుతుందని, ఆ కృషికి సరైన గుర్తింపు దక్కడం లేదని పేర్కొన్నారు.
టీ20 ఫార్మాట్‌లో భారత జట్టును భవిష్యత్తులో నడిపించే సామర్థ్యం షెఫాలీ, జెమీమా ఇద్దరికీ ఉందని మిథాలీ స్పష్టం చేశారు. వారి నాయకత్వాన్ని ఇప్పటి నుంచే తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

