నూతన గోదాములకు భూమి కేటాయించాల‌ని క‌లెక్ట‌ర్‌కు విన‌తి

కలం, కరీంనగర్ బ్యూరో: రైతులకు మెరుగైన మార్కెట్ సౌకర్యాలు కల్పించేందుకు నూతన గోదాములు, షెడ్ల నిర్మాణం కోసం వ్యవసాయ మార్కెట్ కమిటీకి ప్రభుత్వ భూమిని కేటాయించాలని కోరుతూ కరీంనగర్ (Karimnagar) వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న (Akula Narasanna) , డైరెక్టర్లు శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్‌ చిత్రా మిశ్రా (Chitra Mishra )ను ఆమె చాంబర్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. మార్కెట్ కమిటీ పరిధిలోని కాటన్ మార్కెట్ యార్డు, గ్రెయిన్స్ మార్కెట్ యార్డు, ఫ్రూట్ మార్కెట్ యార్డుల్లో ప్రస్తుతం ఉన్న స్థలం రైతుల అవసరాలకు సరిపోవడం లేదని వివరించారు.

ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటుకు రెండు ఎకరాల భూమిని మున్సిపల్ కార్పొరేషన్‌కు కేటాయించడంతో పాటు, సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు కోసం రెండు ఓపెన్ షెడ్లను ఇచ్చిన నేపథ్యంలో మార్కెట్ యార్డులో స్థలాభావం ఏర్పడిందని తెలిపారు. ధాన్యం, పత్తి, మామిడి, పండ్లు తదితర వ్యవసాయ ఉత్పత్తులను తీసుకువచ్చే రైతులకు గోదాములు, షెడ్లు అత్యవసరమని పేర్కొన్నారు. మార్కెట్ యార్డు అభివృద్ధితో పాటు రైతులకు మెరుగైన నిల్వ సౌకర్యాలు కల్పించేందుకు మార్కెట్ కమిటీ పరిధిలో ఎక్కడైనా అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని మార్కెట్ కమిటీకి కేటాయించాలని కోరారు.

ఈ అంశంపై జూలై 12న నిర్వహించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ సాధారణ సమావేశంలో సభ్యులు సుదీర్ఘంగా చర్చించి, ప్రభుత్వ భూమి కేటాయింపునకు జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు. వినతిపత్రాన్ని స్వీకరించిన జిల్లా కలెక్టర్ భూమి కేటాయింపుపై సమగ్రంగా పరిశీలన జరిపి, తగిన చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేస్తానని హామీ ఇచ్చినట్లు చైర్మన్, డైరెక్టర్లు తెలిపారు.

రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించడం పట్ల మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు పంజాల శ్రీనివాస్ గౌడ్, బోనాల శ్రీనివాస్, ఖాజా, రుద్ర రాము, మీసాల శంకర్, తపట్ల రాజు, జగ్గని కనకయ్య, రావణవేణి సంపత్, కాసవేణి భూమయ్య, మాలోతు మాలతి, శివనాధుని వెంకటేశ్వర్లు, పల్లా శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>