కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో కొందరు ఉద్యోగులు కార్యాలయంలో పనిచేస్తున్న మహిళ ఉద్యోగినిని లైంగికంగా వేధిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న వారిని సస్పెండ్ చేయాలని సిపిఐ (CPI) నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ సహాయ కార్యదర్శులు న్యాలపట్ట రాజు, పైడిపల్లిరాజులు మాట్లాడుతూ.. మున్సిపల్ కార్యాలయంలో ఎన్నడూ లేని విధంగా లైంగిక వేదింపుల ఆరోపణలు రావడం చాలా బాధాకరమన్నారు.
మహిళా ఉద్యోగులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామంటూ బెదిరిస్తూ లొంగదీసుకునే ప్రయత్నం చేయడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా కార్యాలయంలోనే అసభ్యకరంగా ప్రవర్తించడం చూస్తుంటే మహిళలకు ఎంత భద్రత ఉందో అర్థం అవుతుందన్నారు. నిత్యం ఏదో ఒక పనిమీద వందలాదిమంది మహిళలు మున్సిపల్ కార్యాలయానికి వస్తారని ఇలాంటి సంఘటనలు బయట తెలిస్తే రావడానికి కూడా భయపడతారని పేర్కొన్నారు.
మహిళ ఉద్యోగిని వేధింపులకు గురి చేస్తున్న ఉద్యోగులను వెంటనే సస్పెండ్ చేయాలని, వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. స్పందించిన మేయర్ ఈ సమస్య పైన మహిళా అధికారులతో కమిటీ వేశామని , కమిటీ రిపోర్ట్ రెండు రోజుల్లో వస్తుందని రిపోర్ట్ రాగానే వారి పై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బ్రాహ్మణ పెళ్లి యుగంధర్ , జువ్వాజి తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

