కలం, తెలంగాణ బ్యూరో: వైద్యం, విద్యపై ప్రభుత్వం చేసే ఖర్చు ఉచితమో లేక సంక్షేమమో కాదని, రాష్ట్ర అభివృద్ధికి పెట్టే పెట్టుబడి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) వ్యాఖ్యానించారు. ఈ ఖర్చంతా రాష్ట్ర స్థూల ఉత్పత్తిని పెంచే మానవ వనరులపై దీర్ఘకాలిక పెట్టుబడిగా అభివర్ణించారు. ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) ఆధ్వర్యంలో ఎంపికైన 247 మంది నర్సింగ్ అధికారులకు సేవాలాల్ భవన్లో శుక్రవారం నియామక పత్రాలు అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటివరకు మొత్తం 76 వేల ఉద్యోగాలను ఇచ్చామన్నారు. వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు 120 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ఆరుగురు డెంటల్ సివిల్ సర్జన్లు, 99 మంది ఫార్మసిస్టులు, 34 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 54 మంది ఏఎన్ఎంలతో పాటు ఇతర పారామెడికల్ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. రెండున్నరేండ్లలోనే ఇన్ని ఉద్యోగాలు ఇవ్వడం ఒక రికార్డు అని అన్నారు.
వైద్య సేవల్లో అగ్రగామిగా తెలంగాణ :
రాష్ట్ర ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా సనత్‌నగర్ ఈఎస్ఐ ఆసుపత్రితో పాటు ఎల్బీనగర్, అల్వాల్, వరంగల్‌లలో నిర్మిస్తున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు. ‘నిమ్స్’ విస్తరణకు ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రవ్యాప్తంగా 44,029 పడకల సామర్థ్యంతో దేశంలోనే అత్యధిక సగటు పడకలు కలిగిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నామన్నారు. ఐఎంఎస్ ద్వారా దాదాపు 75 లక్షల మందికి వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. ఈఎస్ఐ ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా రూ.30 కోట్ల నిధుల విడుదలకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్మికులు, వారి కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఈఎస్ఐ ఆసుపత్రులను ఆధునీకరిస్తున్నామని, డయాలసిస్ యూనిట్లు, సీటీ స్కాన్ సదుపాయాలు, బర్న్స్ వార్డులు, కార్డియాక్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు గుర్తుచేశారు.

