కలం, హనుమకొండ: కాకతీయ యూనివర్సిటీ (Kakatiya University) ని రాజకీయాలకు వేదికగా కాకుండా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే అభివృద్ధి కేంద్రంగా మార్చేందుకు అందరూ సహకరించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (MLA Naini Rajender Reddy) పిలుపునిచ్చారు. శుక్రవారం యూనివర్సిటీలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు విద్యార్థి సంఘాలు రాజకీయ అజెండాతో విద్యార్థులను రెచ్చగొట్టి యూనివర్సిటీ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటును మాత్రమే వ్యతిరేకించడం సరైనది కాదని, యూనివర్సిటీ భూములను గతంలో సబ్‌స్టేషన్, బ్యాంకు, పోలీస్ స్టేషన్ తదితర ప్రభుత్వ అవసరాలకు కేటాయించినప్పుడు అభ్యంతరం చెప్పని వారు ఇప్పుడు మాత్రమే ఉద్యమాలు చేయడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ప్రశ్నించారు. మెస్ అక్రమాలు, సిబ్బంది రెగ్యులరైజేషన్ వంటి విద్యార్థుల అసలు సమస్యలపై స్పందించకుండా అభివృద్ధి పనులను అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు.
మామునూరు విమానాశ్రయం విషయంలో బీఆర్ఎస్‌కు మాట్లాడే నైతిక హక్కు లేదని, పదేళ్ల పాలనలో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేకపోయారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో కేంద్రంతో చర్చలు జరిపి విమానాశ్రయ ప్రాజెక్టుకు వేగం తీసుకొచ్చామని తెలిపారు. కాకతీయ యూనివర్సిటీలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని, యూనివర్సిటీ అభివృద్ధికి అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు. అనంతరం జాయింట్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన పుల్ల శ్రీనివాస్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పెద్దమల్ల శ్రీనివాస్‌లను ఎమ్మెల్యే సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

