వనపర్తిలో భారీ విద్యా ప్రాజెక్ట్.. కలెక్టర్ కీలక ఆదేశాలు

కలం, వనపర్తి :  యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో వచ్చే ఏడాది జూలై నాటికి విద్యా బోధన ప్రారంభించేలా నిర్మాణ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని.. వనపర్తి జిల్లా కలెక్టర్ (Wanaparthy Collector) ఆదర్శ్ సురభి (Adarsh Surabhi) అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను (Young India Integrated School) కలెక్టర్ పరిశీలించారు. భవన నిర్మాణ పనుల పురోగతి, మౌలిక వసతుల ఏర్పాటుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి పనికి ప్రత్యేక వర్క్ షెడ్యూల్ రూపొందించి సమర్పించాలని, లక్ష్యాలకు అనుగుణంగా పనులను వేగవంతం చేయాలని సూచించారు. నిర్మాణ పనులలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఎలాంటి రాజీ లేకుండా నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసి విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు.

వెల్టూరు పాఠశాల పరిశీలన

వనపర్తి నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు ప్రతిపాదనలో భాగంగా పెద్దమందడి మండలం వెల్టూరు ZPHS పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. పాఠశాల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, నిర్మాణ అవకాశాలను పరిశీలించారు. అవసరమైన వ్యయ అంచనాలను ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించిన కలెక్టర్, సమగ్ర ఎస్టిమేట్ సిద్ధం చేసి సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా స్థానికులు పాఠశాల నిర్మాణానికి ముందుగా స్థలాన్ని పూర్తిస్థాయిలో సర్వే చేసి హద్దులు నిర్ధారించిన అనంతరం పనులు ప్రారంభించాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. స్థలాన్ని సమర్థవంతంగా వినియోగిస్తే విద్యార్థులకు ఆటస్థలం, ఇతర కార్యక్రమాలకు విశాలమైన మైదానం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ పర్యటనలో జడ్పీ సీఈఓ యాదయ్య, ఈడబ్ల్యూఐడీసీ ఇంజినీరింగ్ అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>