ఆసుపత్రిలో అపరిశుభ్రత.. యాదాద్రి కలెక్టర్ ఆగ్రహం

కలం, మోత్కూర్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరే రోగులకు నాణ్యమైన వైద్య సేవలతో పాటు పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్పష్టం చేశారు. గురువారం మోత్కూర్ (Mothkur) ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించి, వసతులపై సమీక్షించారు.

తనిఖీల్లో భాగంగా కలెక్టర్ ముందుగా ఇన్‌పేషెంట్ వార్డులను పరిశీలించారు. బెడ్‌షీట్లు అపరిశుభ్రంగా ఉండటం, సరిగ్గా మార్చకపోవడాన్ని గమనించిన కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత సూపర్‌వైజర్‌కు తక్షణమే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.

యాప్‌లో నమోదు చేయాలని ఆదేశాలు..

ఆసుపత్రికి రోజూ వస్తున్న ఓపీ, వారికి అందిస్తున్న ఉచిత మందులు, రక్త పరీక్షలు, ఇతర రోగ నిర్ధారణ పరీక్షల వివరాలను కలెక్టర్ అనురాగ్ జయంతి అడిగి తెలుసుకున్నారు. రోగుల పూర్తి సమాచారాన్ని, చికిత్స వివరాలను సకాలంలో ‘ఈ-ఆరోగ్యం’ యాప్‌లో నమోదు చేస్తున్నారా లేదా అని ప్రశ్నించారు. ప్రతి ఒక్క రికార్డును తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు నవీకరించాలని ఆదేశించారు.

ప్రసవాలపై ఆరా..

ఈ నెలలో జరగాల్సిన ప్రసవాల వివరాలు, గర్భిణులను ఎలా ట్రాక్ చేస్తున్నారనే అంశంపై కలెక్టర్ ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ప్రసవాలెన్ని, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లినవి ఎన్ని అనే నివేదికలను పరిశీలించారు.

ప్రైవేట్ ఆసుపత్రులకు ఏ కారణాల వలన వెళ్లాల్సి వచ్చిందో విశ్లేషించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు, అత్యవసర వైద్య సేవలు, ఉచిత మందులు, అనుభవజ్ఞులైన వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నందున, గర్భిణులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశం..

ఆసుపత్రి పరిసరాల్లో వాటర్ ట్యాంక్ వద్ద నీరు వృథాగా నిలిచి ఉండటాన్ని కలెక్టర్ గమనించి, తక్షణమే మున్సిపల్ కమిషనర్‌కు ఫోన్ చేసి, పూర్తిగా క్లీన్ చేయించాలని ఆదేశించారు.

అలాగే ఆసుపత్రి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా శుభ్రం చేయించాలని, ట్యాంకును వెంటనే వాడకంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఆసుపత్రి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని కలెక్టర్ హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>