కలం, స్పోర్ట్స్: కజకిస్థాన్‌లో జరిగిన అల్మాటీ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో భారత ఆటగాడు యూకీ భాంబ్రీ (Yuki Bhambri) సత్తా చాటాడు. అమెరికాకు చెందిన ర్యాన్ సెగ్గర్మన్తో కలిసి డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ ఆస్ట్రియా జోడీ లూకాస్ మిడ్లర్, నీల్ ఒబెర్లైట్నర్ను ఓడించారు. 7-6(3), 6-7(1), 10-2తో విజయం సాధించారు. ఇది భాంబ్రీ కెరీర్లో ఐదో ఏటీపీ టూర్ టైటిల్. ఫైనల్ పోరు ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. తొలి సెట్లో ఇరు జోడీలు గట్టిగా పోటీపడ్డాయి. దీంతో టైబ్రేకర్ అనివార్యమైంది.
అందులో భాంబ్రీ, సెగ్గర్మన్ 7-3తో పైచేయి సాధించారు. రెండో సెట్లో ఆస్ట్రియా జోడీ పుంజుకుంది. టైబ్రేకర్‌ను 7-1తో గెలిచి స్కోరును సమం చేసింది. దీంతో మ్యాచ్ విజేతను నిర్ణయించేందుకు సూపర్ టైబ్రేకర్ నిర్వహించారు. ఇందులో భాంబ్రీ జోడీ ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 10-2తో గెలిచి ట్రోఫీని అందుకుంది. ఈ మ్యాచ్ గంటా 26 నిమిషాల పాటు సాగింది. భాంబ్రీ జోడీ ఆరు ఏస్‌లు కొట్టగా, ఒకే డబుల్ ఫాల్ట్ చేసింది.
భాంబ్రీ గత కొంతకాలంగా అంతర్జాతీయ టెన్నిస్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. 2025లో దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో తన తొలి ఏటీపీ 500 టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఈ ఏడాది ఇండియన్ వెల్స్ టోర్నీలో ఏటీపీ మాస్టర్స్ 1000 స్థాయిలో తొలిసారి సెమీఫైనల్‌కు చేరాడు. ఫిబ్రవరిలో ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో కెరీర్ అత్యుత్తమంగా 20వ స్థానానికి చేరుకున్నాడు.

