కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కాంగ్రెస్‌లో (Nirmal Congress) అంతర్గత విభేదాలు కాస్త ఐదు గ్రూపులుగా మారాయి. ఒకప్పుడు మూడు వర్గాలుగా ఉంటే.. ఇప్పుడు ఐదు గ్రూపులకు చేరాయి. నేతల మధ్య వర్గపోరు కేడర్ ను అయోమయంలో పడేసింది. పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు దక్కుతాయని ఆశించిన ఆశావహులకు నిరీక్షణ తప్పడం లేదు. భర్తీలో జాప్యం, నేతల మధ్య సమన్వయలోపం వెరసి తీవ్ర అసంతృప్తిగా మారుతోంది. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, నిర్మల్ సెగ్మెంట్ కాంగ్రెస్ ఇన్చార్జి కూచాడి శ్రీహరిరావు వర్గాలతో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సయ్యద్ అర్జుమంద్ అలీ, కేంద్ర మాజీ మంత్రి ఎస్. వేణుగోపాలాచారి, నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి పార్టీలో వర్గాలుగా చీలిపోయారు.
దీంతో ఏ నేత వెంట నడవాలో తెలియక కేడర్ ఆందోళనలో పడింది. కొందరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల దసరాను పురస్కరించుకుని ఇంద్రకరణ్ రెడ్డి వర్గం నేతలు ఫ్లెక్సీని ఏర్పాటు చేయగా.. అందులో కూచాడి శ్రీహరిరావు ఫొటో లేదు. దీంతో పార్టీలోని అంతర్గత విభేదాలకు అద్దం పడుతుందనే చర్చ స్థానికంగా జరుగుతోంది.
నామినేటెడ్ పదవులపై ఆశలు
దసరాకు ముందే నామినేటెడ్ పదవుల భర్తీ జరుగుతుందనే ఆశలతో పలువురు పార్టీ నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మార్కెట్ కమిటీలు, పీఏసీఎస్ చైర్మన్లు, ఆలయ కమిటీల నియామకాలకు తమ అనుచరుల పేర్లను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అయితే వేర్వేరు వర్గాల నుంచి ప్రతిపాదనలు రావడం, నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎంపిక ప్రక్రియ మరింత క్లిష్టంగా మారింది. తద్వారా పార్టీ కోసం ఏళ్లుగా పనిచూసే సీనియర్లకు పదవులు దక్కకపోవడంపై అసంతృప్తి తీవ్రమవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తమకు అవకాశం రాకుండా కొందరు అడ్డుపడుతున్నారంటూ పలువురు నేతలు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీపై స్పష్టత లేకపోవడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.
ఓటమికి విభేదాలే కారణమా..!
గత అసెంబ్లీ ఎన్నికల్లో నిర్మల్, ముథోల్ లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఖానాపూర్‌లో మాత్రమే గెలిచింది. నేతల మధ్య విభేదాలు, సీనియర్లకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడం వంటి అంశాలు పార్టీ ఫలితాలపై ప్రభావం చూపాయని అప్పట్లో రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పుడు కూడా అదే తరహా పరిస్థితులు కొనసాగుతుండగా.. భవిష్యత్ లో పార్టీకి ఇబ్బందులు తప్పవనే ఆందోళన కార్యకర్తల్లో ఉంది. మరోవైపు ప్రత్యర్థి పార్టీలకు రాజకీయంగా అనుకూలించే అవకాశం ఉందని కేడర్ చర్చించుకుంటోంది.
అధిష్టానానికి సవాల్ గా విభేదాలు
ఇంద్రకరణ్‌రెడ్డి, వేణుగోపాలాచారి, నారాయణరావు పటేల్, విఠల్‌రెడ్డి, రేఖానాయక్ వంటి సీనియర్ నేతలకు పార్టీలో తగిన ప్రాధాన్యం దక్కుతుందా..! అనే చర్చ కూడా నడుస్తోంది. కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారని పార్టీ శ్రేణులు చెబుతుండగా.. వారి రాజకీయ భవిష్యత్‌పై ఎలాంటి స్పష్టత లేదు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ నేతల మధ్య సమన్వయం కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, నిర్మల్, ముథోల్ లో పార్టీలో విభేదాలు పూర్తిస్థాయిలో సద్దుమణగడం లేదు. పార్టీ సమావేశాల్లోనూ ఆయన హెచ్చరించినా ఎలాంటి మార్పు కనిపించడం లేదని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీపై అధిష్టానం స్పష్టమైన నిర్ణయం తీసుకుని, కష్టపడిన కార్యకర్తలకు న్యాయం చేయడంతో పాటు వర్గ విభేదాలను పరిష్కరించాల్సి ఉందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా నిర్మల్ కాంగ్రెస్‌లోని గ్రూపుల మధ్య విబేధాలకు అధిష్టానం ఎలాంటి పరిష్కారం చూపుతుందో వేచి చూడాల్సి ఉంది.

