కలం, ఖమ్మం బ్యూరో: బాలల హక్కుల పరిరక్షణ, వారి సమగ్ర అభివృద్ధిలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ జి.ప్రేమలత (Judge Premalatha) స్పష్టం చేశారు. జిల్లా కోర్టు సముదాయంలోని బార్ అసోసియేషన్ లైబ్రరీ హాల్లో శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ‘మిషన్ బాల్ సురక్ష, శిక్షా మరియు న్యాయ 2026’ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఛైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లుగా నియమితులైన నామినేటెడ్ ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
హక్కులకు భంగం కలిగితే..
ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.ప్రేమలత మాట్లాడారు. ప్రతి విద్యార్థికి రాజ్యాంగం కల్పించిన విద్యా హక్కు, రక్షణ, సమానత్వం, గౌరవప్రదమైన జీవనం అందేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. విద్యార్థుల ప్రవర్తన, మానసిక స్థితిని గమనిస్తూ పాఠశాలల్లో పిల్లలపై జరిగే వేధింపులు, వివక్ష, నిర్లక్ష్యం, దోపిడీ వంటి అంశాలపై ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
బాలల హక్కులకు భంగం కలిగే సంఘటనలు ఎదురైనప్పుడు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని జడ్జి ప్రేమలత సూచించారు. బాధిత పిల్లలకు అండగా నిలవాలని, చట్టాలపై అవగాహన ద్వారా పాఠశాలల్లో సురక్షితమైన విద్యా వాతావరణాన్ని సృష్టించవచ్చని చెప్పారు. మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్.సరిత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్ ముదుల్కర్, జిల్లా విద్యాశాఖ అధికారి శంభు ప్రసాద్, జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా పాల్గొన్నారు.

