కలం, ఖమ్మం బ్యూరో: ప్రకృతిలో అప్పుడప్పుడు జరిగే వింతలు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు (Manuguru) మండలంలో అలాంటి అరుదైన ఘటనే చోటుచేసుకుంది. అచ్చం వినాయకుడి ఆకారంలో బొప్పాయి పండు దర్శనమివ్వడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మణుగూరు మండలం చెరువు ముందు సింగారం గ్రామానికి చెందిన రాములు ఇంటి ఆవరణలో ఉన్న బొప్పాయి చెట్టుకు కాయలు కాశాయి. చెట్టు నుంచి కోసిన ఒక బొప్పాయి పండులో వినాయకుడి (గణపతి) ప్రతిరూపం స్పష్టంగా కనిపించింది.
తరలి వస్తున్న ప్రజలు..
తొడిమ భాగం, ఆకారాలు సరిగ్గా ఏకదంతుడైన వినాయకుడి ఆకారాన్ని పోలి ఉండటంతో రాములు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆశ్చర్యచకితులయ్యారు. ఈ వింత వార్త చుట్టుపక్కల గ్రామాలకు పాకడంతో, చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బొప్పాయి పండులో వినాయకుడి రూపం ప్రత్యక్షం కావడాన్ని గ్రామస్తులు ఎంతో పవిత్రంగా భావిస్తున్నారు. ఇది తమ గ్రామానికి శుభసూచకమని, దేవుని మహిమగా కొనియాడుతూ భక్తిశ్రద్ధలతో నమస్కరించుకుంటున్నారు. ప్రస్తుతం మణుగూరు పరిసర ప్రాంతాల్లో ఈ వినాయక బొప్పాయి కాయ గురించిన చర్చ హాట్ టాపిక్‌గా మారింది.

