కలం, కడెం : సదర్మాట్ ఆయకట్టు పరిధిలోని పంటలకు చివరి వరకు సాగునీరు అందించాలని కోరుతూ కడెం మండలం ధర్మాజీపేట్ (Dharmajeepet) గ్రామంలో రైతులు శనివారం ఆందోళన చేపట్టారు. కడెం వైపు వెళ్తున్న జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా వాహనాన్ని ఆపి తమ సమస్యలను వివరించారు. వారబందీ విధానాన్ని తొలగించి, పంటలు ఎండిపోకుండా నిరంతరంగా సాగునీరు విడుదల చేయాలని కోరారు.
రైతుల సమస్యలపై స్పందించిన కలెక్టర్.. నీటి నిల్వలను పరిశీలించి నివేదిక అందించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. సోమవారం తాను స్వయంగా పంట పొలాలను సందర్శించి సాగునీటి పరిస్థితిని పరిశీలిస్తానని తెలిపారు. వారం రోజుల్లో సాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు.

