కలం, కరీంనగర్ బ్యూరో: సింగరేణి (Singareni) బొగ్గు పరిశ్రమ ఉత్పత్తిని పెంచడంతో పాటు బొగ్గు రవాణా లక్ష్యాలను అధిగమించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలోని సింగరేణి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులు బొగ్గు రవాణాలో రికార్డులు సాధిస్తున్నాయి. ఆర్జీ-1 ఏరియాలోని గోదావరిఖని ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు-5 (ఓసీపీ-5) బొగ్గు రవాణాలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. శుక్రవారం ఒక్క రోజులోనే 9,666 టన్నుల బొగ్గు రవాణా లక్ష్యానికి గాను 13,681 టన్నుల బొగ్గును రవాణా చేసి నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించింది.
సమష్టి కృషితోనే సాధ్యం: లలిత్ కుమార్
ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులో నిర్దేశిత లక్ష్యానికి మించి బొగ్గును రవాణా చేసి రికార్డు సాధించడంపై ఆర్జీ-1 ఏరియా జనరల్ మేనేజర్ డి.లలిత్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయానికి కృషి చేసిన గని అధికారులు, ఉద్యోగులు, కార్మికులు, యూనియన్ ప్రతినిధులు, కాంట్రాక్టు ఉద్యోగులను ఆయన అభినందించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచాలని, రవాణా లక్ష్యాల సాధనకు సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.

