కలం, నల్లగొండ : ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంచేందుకు, ఉన్నత లక్ష్యాలను సాధించేలా వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక అద్భుతమైన అవకాశాన్ని ప్రకటించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడ కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో (Bottuguda School) పదవ తరగతి చదివి, పదికి పది (ఫస్ట్ ర్యాంక్) సాధించే విద్యార్థులను మంత్రి తన సొంత ఖర్చులతో ఢిల్లీ పర్యటనకు తీసుకెళ్లనున్నారని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ (Collector Chandrashekar) వెల్లడించారు.
శనివారం బొట్టుగూడ పాఠశాలను (Bottuguda School) కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముఖాముఖి మాట్లాడి పాఠశాలలోని విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు. కలెక్టర్ చంద్రశేఖర్ పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ.. “కష్టపడి చదివి మెరుగైన మార్కులు సాధించండి. ఫస్ట్ ర్యాంకు సాధించిన విద్యార్థులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమాన ప్రయాణ ఖర్చులు, ఇతర బస, షాపింగ్ ఖర్చులన్నింటినీ తమ సొంత నిధులతో భరిస్తారు. అంతేకాకుండా ఢిల్లీలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించే అరుదైన అవకాశాన్ని కల్పిస్తారు” అని తెలిపారు.
సందర్శనలో భాగంగా కలెక్టర్ ఏడో తరగతి గదికి వెళ్లి బోధనా తీరుపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు బాగా బోధిస్తున్నారని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం పదో తరగతి గదిలో రిఫ్లెక్షన్, నాన్-రిఫ్లెక్షన్ అంశాలపై కలెక్టర్ ప్రశ్నించగా.. విద్యార్థులు నేరుగా బ్లాక్‌బోర్డుపై సమాధానాలు రాసి వివరించిన తీరును చూసి కలెక్టర్ అభినందించారు. విద్యార్థుల జవాబు పత్రాలను స్వయంగా పరిశీలించారు. 8, 9, 10 తరగతుల్లో చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, నిర్దిష్ట లక్ష్యాలతో మెరుగైన ఫలితాలు సాధించేలా చూడాలని హెచ్ఎం సురేష్ కుమార్‌ను ఆదేశించారు.
ఎల్ నినో (El Nino) ప్రభావంతో రానున్న రోజుల్లో నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నందున పాఠశాలలో నీటి చుక్క వృథా కాకుండా చూడాలన్నారు. లీకేజీలు ఉన్న కుళాయిలను వెంటనే బాగుచేయించాలని సూచించారు. ప్రతిరోజూ ఉదయం ప్రార్థనా సమయంలో విద్యార్థులతో నీటి సంరక్షణ ప్రతిజ్ఞ చేయించాలని ఆదేశించారు. విద్యార్థులు పాఠశాలలోనే కాకుండా ఇళ్ల వద్ద కూడా నీటిని పొదుపు చేసేలా సామాజిక బాధ్యత అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ రామాచారి, ఎంఈఓ అరుంధతి, ప్రధానోపాధ్యాయులు సురేష్ కుమార్, సుధారాణి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Also Read : ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు సింధూ..!
Follow Us On : WhatsApp

