కలం, వెబ్ డెస్క్ : తూర్పు గోదావరి జిల్లా గోకవరం (Gokavaram Bus Accident) మండల పరిధిలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోకవరం నుంచి జగ్గంపేట వైపు సాధారణ ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును, చెంగారమ్మ చింత (సిగరమ్మ చింత) ప్రాంతంలో వెనుక వైపు నుంచి అతివేగంతో వచ్చిన ఒక క్వారీ టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు వెనుక భాగంగా తీవ్రంగా నలిగిపోయి నుజ్జునుజ్జయింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ ప్రమాదంలో బస్సు వెనుక సీట్లలో కూర్చొన్న పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయలయ్యాయి. ముఖ్యంగా ఇద్దరు చిన్నారుల కాళ్లు వాహన భాగాల మధ్య చిక్కుకుపోవడంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి తీవ్రంగా శ్రమించి చిన్నారులను బయటకు తీసి, గాయపడిన వారందరినీ అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ నిర్లక్ష్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

