మెదక్‌లో విద్యుత్ కోతలపై ఎమ్మెల్యే ఆగ్రహం.. NH-44పై రైతులతో కలిసి రాస్తారోకో!

కలం, మెదక్ బ్యూరో: వ్యవసాయానికి కీలకమైన సమయంలో విద్యుత్ కోతలు విధించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి (Sunitha Laxma Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మెదక్ (Medak) జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో రైతులతో కలిసి జాతీయ రహదారి NH-44పై రాస్తారోకో నిర్వహించారు.

దీంతో రహదారిపై ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తొలుత స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సందర్శించిన ఎమ్మెల్యే విద్యుత్ సరఫరాకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం సబ్‌స్టేషన్ ఎదుట రైతులతో కలిసి బైఠాయించి నిరసన తెలిపారు. విద్యుత్ కోతలతో నీరందక ఎండిపోతున్న పంట పొలాలను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వ్యవసాయానికి అవసరమైన సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో రైతులు పంటలకు సకాలంలో నీరందించలేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విద్యుత్ కోతల వల్ల పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలను నివారించేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>