కలం, మెదక్ బ్యూరో : సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్‌లో రైతుపై ఎస్సై మల్లారెడ్డి (Gajwel SI Mallareddy) దాడి చేశారన్న ఆరోపణలు కలకలం రేపాయి. బోరు మోటారు నీళ్ల విషయంలో బంధువులతో తలెత్తిన వివాదంపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన రైతుకు పోలీస్ స్టేషన్‌లోనే ఎస్సై రైతుపై దాడి (Farmer Assault) చేశారని బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు. గజ్వెల్ మండలం గిరిపల్లి గ్రామానికి చెందిన భీమరి రవికి తన వ్యవసాయ పొలం వద్ద ఉన్న బోరు మోటారు నీటి విషయంలో బంధువులతో వాగ్వాదం, దాడి జరిగింది. అనంతరం తనపై దాడి చేసిన బంధువులపై ఫిర్యాదు చేసేందుకు రవి గజ్వేల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు.
అయితే అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై అకారణంగా ఆమర్యాదగా మాట్లాడుతూ భీమరి రవి చెంపపై కొట్టారని, దీంతో కనుబొమ్మ ప్రాంతంలో గాయమై రక్తస్రావం జరిగిందని రవి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న గజ్వేల్ ఏసీపీ నర్సింలు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా రవికి, ఎస్సైకి మధ్య వాగ్వాదం జరిగిందని, ఈ క్రమంలో ఎస్సై రవి చెంపపై కొట్టడంతో కనుబొమ్మపై గాయమై రక్తస్రావం జరిగిందని ఏసీపీ నర్సింలు వెల్లడించినట్లు సమాచారం. గాయపడిన రవిని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.
గజ్వేల్ ఎస్ఐ మల్లారెడ్డిపై వేటు..
రైతుపై చేయి చేసుకున్న ఘటనలో గజ్వేల్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మల్లారెడ్డిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఆయనను సీఏఆర్ (CAR) హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఐ బదిలీ కావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

