ఆ ఎగ్జామ్‌ను వాయిదా వేయండి: సీఎం రేవంత్‌కు హరీశ్ రావు లేఖ

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలోని ఇంజినీరింగ్ అభ్యర్థుల ఉద్యోగ అవకాశాలను కాపాడేందుకు నవంబర్ 6న నిర్వహించనున్న TGPSC AEE (సివిల్) పరీక్షను వెంటనే వాయిదా వేయాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ SSC JE, TGPSC AEE పరీక్షలు ఒకే రోజు (నవంబర్ 6న) నిర్వహించడం వల్ల వేలాది మంది తెలంగాణ అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆయన పేరొన్నారు. ఇతర రాష్ట్రాల్లోని కేంద్రాల్లో ఎస్సెస్సీ పరీక్ష రాసే అభ్యర్థులు అదే రోజు తెలంగాణకు వచ్చి ఏఈఈ పరీక్ష రాయడం ఏమాత్రం సాధ్యం కాదని, ఏళ్ల తరబడి కష్టపడి సిద్ధమైన నిరుద్యోగులు ఏదో ఒక అవకాశాన్ని వదులుకోవాల్సి రావడం అన్యాయమని లేఖలో విమర్శించారు.

పరిస్థితి తీవ్రతను వివరిస్తూ పరీక్ష తేదీల్లో మార్పులు చేయాలని అభ్యర్థులు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ TGPSC ఏమాత్రం స్పందించకపోవడం శోచనీయమని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఇటీవల టీజీపీఎస్సీకి లేఖ రాసి పరీక్షల షెడ్యూల్‌ను పునఃపరిశీలించాలని కోరిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఒడిశా, బీహార్ వంటి ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు అక్కడి ప్రభుత్వాలు స్పందించి పరీక్ష తేదీలను సవరించినప్పుడు, తెలంగాణలో మార్చడానికి ఎందుకు సాధ్యం కాదని లేఖలో ప్రశ్నించారు.

నిరుద్యోగ యువత అసలు పరీక్షలే వద్దనడం లేదని, రెండు పరీక్షలు రాసేందుకు వీలుగా సమయం మాత్రమే కేటాయించాలని కోరుతున్నారని హరీశ్ రావు (Harish Rao) స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బేషజాలకు పోకుండా వెంటనే జోక్యం చేసుకొని నవంబర్ 6న జరగాల్సిన TGPSC AEE (సివిల్) పరీక్షను వాయిదా వేసి, అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు భవిష్యత్తులో జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల తేదీలు ఒకే రోజు రాకుండా ప్రభుత్వం, టీజీపీఎస్సీ ముందస్తు సమన్వయ జాగ్రత్తలు తీసుకోవాలని లేఖలో హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు.

Also Read : ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని నుజ్జునుజ్జైన ఆర్టీసీ బస్సు..!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>