కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) నేపథ్యంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై సీఎం చంద్రబాబు (Chandrababu) అమరావతిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో స్థానిక ఎన్నికలు అత్యంత కీలకమైన భాగమని, అయితే కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణను తట్టుకోలేక ఎన్నికలను నిలిపివేసేందుకు వైఎస్సార్సీపీ అధినేత జగన్ పదేపదే న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సమరానికి అడ్డంకులు సృష్టిస్తూ దాదాపు 59కి పైగా పిటిషన్లు దాఖలు చేసి, కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులను రాష్ట్రానికి అందకుండా కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత కాంగ్రెస్, వైఎస్ఆర్ పాలనలను తాను దగ్గరుండి చూశానని, కానీ జగన్ (YS Jagan) మనస్తత్వం వైవిధ్యమైనది మాత్రమే కాక రాష్ట్ర భవిష్యత్తుకే ప్రమాదకరమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. బెంగళూరు నుంచి వచ్చి గంటల తరబడి ప్రెస్ మీట్లు పెడుతూ, అసత్యాలను నిజాలుగా నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. గత వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రమంతటా వినాశకరమైన పరిస్థితులు నెలకొన్నాయని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రత్యర్థులపై దాడులకు పాల్పడ్డారని విమర్శించారు.
పుంగనూరు, రాయచోటి, పులివెందుల, దర్శి, తిరుపతి, కనిగిరి, పత్తికొండ, తంబళ్లపల్లె వంటి ప్రాంతాల్లో నామినేషన్ కేంద్రాల వద్దకు చొరబడి దాడులు చేయడం, కూటమి శ్రేణులను వాహనాలతో తొక్కిస్తూ భయాందోళనలు సృష్టించడం వారి వైఖరికి నిదర్శనమని చెప్పారు. రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే అంతర్రాష్ట్ర కిరాయి గుండాలను రంగంలోకి దించారని ఆరోపించారు. కోర్టుల్లో తప్పుడు వివరాలు సమర్పించి ఏపీలో ప్రెసిడెంట్ రూల్ విధించేలా కుట్రలు పన్నుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. గతంలో కరోనా సమయంలో ఉపాధ్యాయులను బ్రాందీ షాపుల ముందు క్యూలైన్లలో నిలబెట్టి వ్యవస్థలను నిర్వీర్యం చేసిన చరిత్ర జగన్‌దని సీఎం గుర్తుచేశారు.
ఇప్పుడు రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని జగన్ ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు (Chandrababu) ఆరోపించారు. ఈ క్రమంలోనే “బెంగళూరు నుంచి రావడం.. హిట్ చేయడం.. మళ్లీ అక్కడికే వెళ్లి దాక్కోవడం.. ఇదే జగన్ పని. ప్రెస్మీట్లు పెట్టడం.. ఈసీ, గవర్నర్‌ను కలవడం.. రాత్రికి బెంగళూరు వెళ్లిపోవడం.. ఇదంతా హిట్ అండ్ రన్!” అంటూ విమర్శలు గుప్పించారు. ఇక కుటుంబ విషయాలపై కూడా స్పందిస్తూ.. మేనకోడలి పెళ్లికి కూడా జగన్ అడ్డుపడుతున్నారని, ఆయన మేనమామ కాదు కంసమామ అని ఫైర్ అయ్యారు. వెడ్డింగ్ కార్డులో లొకేషన్ వేసుకున్నాక ఇవ్వనంటున్నారని, ఒక అన్నగా తండ్రిని చంపి చెల్లిని ముద్దాయిని చేసి రోడ్డున తిప్పుతున్నాడని, మరోవైపు చెల్లి షర్మిల కూతురి పెళ్లిని సైతం అడ్డుకుంటున్నాడని మండిపడ్డారు. అన్నగా ఫెయిల్.. మేనమామగా ఫెయిల్.. సీఎంగా రాష్ట్ర విధ్వంసమే జగన్ నైజం అని దుయ్యబట్టారు.
Also Read : చిత్తూరులో విషాదం.. హైటెన్షన్ తీగలకు బలైన అడవి ఏనుగు!
Follow Us On : WhatsApp

