ఉప్పల్‌లో ఆధునిక బస్ టెర్మినల్ నిర్మాణం

కలం, వెబ్ డెస్క్ : ఉప్పల్‌లోని పాత బస్ డిపో స్థలంలో రూ.3.22 కోట్ల అంచనా వ్యయంతో అత్యాధునిక సిటీ బస్ టెర్మినల్ (Uppal Bus Terminal) నిర్మాణ పనులకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) శంకుస్థాపన చేశారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో నిర్మిస్తున్న ఈ టెర్మినల్‌ను 100 రోజుల్లో పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు.

ఈ ఆధునిక టెర్మినల్ (Uppal Bus Terminal) ద్వారా రోజుకు సుమారు 1,053 బస్సు ట్రిప్పులు నడుస్తాయని, దాదాపు లక్ష మంది ప్రయాణికులకు సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ, ఘట్‌కేసర్, మల్కాజిగిరి, రామంతాపూర్ తదితర ప్రాంతాల ప్రజలకు సికింద్రాబాద్, ఐటీ కారిడార్, పటాన్‌చెరు మార్గాల్లో ప్రయాణం మరింత సులభతరం కానుంది.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్ పాస్ కౌంటర్లు, సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ పథకం ద్వారా ఇప్పటివరకు మహిళలకు రూ.12,888 కోట్లు ఆదా అయ్యాయని చెప్పారు. అలాగే ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రిటైర్డ్ సిబ్బంది బకాయిల చెల్లింపుతో పాటు సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా నగరంలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని పెంచుతున్నామని, పీఎం ఈ-డ్రైవ్ కింద 2,200 ఈ-బస్సులను అందుబాటులోకి తేనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, మున్సిపల్ కమీషనర్ వినయ్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Also Read : ఆ ఎగ్జామ్‌ను వాయిదా వేయండి: సీఎం రేవంత్‌కు హరీశ్ రావు లేఖ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>