కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ (Telangana Graduates MLC) ఎన్నికలు సీఎం రేవంత్ రెడ్డికి అసలు పరీక్షగా మారాయి. సీఎం సొంత జిల్లా మహబూబ్‌నగర్ ఈ ఎన్నికల పరిధిలోనే ఉండటంతో ఈ స్థానాల్లో విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో ఇతర పార్టీల కంటే ముందే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహ పర్యవేక్షణలో స్థానిక నేతల అభిప్రాయాలు సేకరించి అభ్యర్థులను ఖరారు చేశారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ స్థానానికి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, హైదరాబాద్-మహబూబ్‌నగర్-రంగారెడ్డి స్థానానికి సామ రామ్మోహన్ రెడ్డి పేర్లను ప్రకటించి ప్రచారంలో ముందంజలో నిలిచారు. టికెట్ లభించని ఆశావాహులతో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడి, ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు.
ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కాంగ్రెస్
హైదరాబాద్-మహబూబ్‌నగర్-రంగారెడ్డి స్థానంలో కాంగ్రెస్ ఇప్పటివరకు గెలవలేదు. గతంలో ఈ సీటును బీఆర్ఎస్, బీజేపీలు గెలుచుకున్నాయి. ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కాంగ్రెస్ ఉంది. ఎన్నికల వ్యూహాలపై సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఓటరు నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టేందుకు మంత్రులు ప్రచారంలోకి దిగారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీగణేశ్ ఆధ్వర్యంలో జరిగిన అర్హులైన పట్టభద్రుల ఓట్ల నమోదు కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ పాల్గొన్నారు. నవంబర్ 6 వరకు ఓటరు నమోదుకు అవకాశం ఉందని మంత్రి పొన్నం తెలిపారు.
మిత్రపక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నం
మరోవైపు మిత్రపక్షాల మద్దతు కూడగట్టేందుకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. శుక్రవారం సీపీఐ కార్యాలయానికి వెళ్లి ఆ పార్టీ అగ్రనేతల మద్దతు కోరారు. సీపీఎంతో పాటు ఎంఐఎం మద్దతు పొందేందుకు కూడా కాంగ్రెస్ సంప్రదింపులు జరుపుతున్నది. ఉమ్మడి 6 జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఏఐసీసీ ఆదేశించింది. విభేదాలు పక్కనబెట్టి ఐక్యంగా పనిచేయాలని, ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థులను ప్రకటించేలోపే మొదటి విడత ప్రచారాన్ని పూర్తి చేయాలని శ్రేణులకు సూచించింది.

