కలం, తెలంగాణ బ్యూరో: రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను గెలవాలని టాస్క్ పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక వ్యూహాన్ని (Congress MLC Strategy) రూపొందించుకున్నది. ఇతర పార్టీలకంటే ముందుగానే అభ్యర్థుల్ని ఖరారు చేసింది. ఆరు ఉమ్మడి జిల్లాల్లోని 77 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ప్రత్యర్థి పార్టీలకు స్కోప్ లేకుండా ఎలాంటి ఎత్తుగడలు అవలంబించాలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది.
అయితే గత ఎన్నికల సందర్భంగా 10.37 లక్షల మంది అర్హులైన ఓటర్లే ఉండగా ఈసారి అది దాదాపు 14 లక్షలు దాటొచ్చని కాంగ్రెస్ పార్టీ అంచనా వేసింది. ఇప్పటివరకు 4.36 లక్షల మంది గ్రాడ్యుయేట్లు మాత్రమే ఓటర్లుగా వారి పేర్లను నమోదు చేసుకున్నందున ఇంకా దాదాపు 10 లక్షల మందిని చేర్చాల్సి ఉన్నదని లెక్కలు వేసింది. ఓటర్లుగా నమోదు చేయడానికి నవంబరు 6 వరకు మాత్రమే డెడ్‌లైన్ ఉండడంతో కనీసంగా రోజుకు 65 లక్షల మంది చొప్పున చేర్చాల్సి ఉన్నదని, దీనికి తగినట్లుగా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు యాక్టివ్‌గా పనిచేస్తూ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నవారిని గుర్తించి ఓటర్లుగా చేర్పించే టాస్క్ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
ఏ సెక్షన్ ఓటర్లపై ఎక్కువ దృష్టి పెట్టాలి?
గ్రాడ్యుయేట్లే ఓటర్లుగా ఉన్నందున ఎవరు మనవారు.. ఎవరు ప్రత్యర్థి పార్టీవారు.. అనేది గుర్తించడం చాలా కీలకమని కాంగ్రెస్ తయారు చేసుకున్న అంతర్గత డాక్యుమెంట్లో నిర్దిష్టమైన కేటగిరీలను ప్రస్తావించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన యువత, ఉద్యోగాల కోసం ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు, మహిళా గ్రాడ్యుయేట్లు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు, రిటైర్ అయిన ఉద్యోగులు, ఇప్పటికే పెన్షనర్లుగా ఉన్నవారు.. వీరిని తొలుత రీచ్ కావాలని, వారిని ఓటర్లుగా నమోదు చేయించాలని కాంగ్రెస్ తన డాక్యుమెంట్లో పేర్కొన్నది.
యాక్టివిటీ ఎలా ఉండాలి?
గ్రాడ్యుయేట్లను ఓటర్లుగా చేర్పించడానికి బాధ్యతలు తీసుకున్న ప్రతీ కాంగ్రెస్ నాయకుడు ముందుగా వారి పేర్లను ఫామ్-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పార్టీ డాక్యుమెంట్ పేర్కొన్నది. ఆ తర్వాత ఆ నాయకుల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను ఓటర్లుగా నమోదు చేయించాలని, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, వారి కుటుంబ సభ్యుల పేర్లను చేర్పించాలని పేర్కొన్నది. గ్రామం, వార్డు, స్థానికంగా ఉన్న గ్రాడ్యుయేట్లందరినీ మనం రీచ్ కావాలని, వారితో ఓటర్లుగా ఎన్రోల్ చేయించాలని పేర్కొన్నది.
రోజుకు ఎంతమందిని చేర్పించాలి?
గతంలో జరిగిన ఎన్నికల్లో 2021 గ్రాడ్యుయేట్ ఓటర్లలో మహిళలు కేవలం 35 శాతమే ఉన్నారని, ఇప్పుడు ఓటర్ల నమోదులో వారి భాగస్వామ్యాన్ని పెంచాలని పేర్కొన్నది. దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, మొత్తం ఓటర్లలో వారి శాతం పెరగాలని, ఒక్కరిని కూడా మిస్ కాకుండా పార్టీ నేతలు యాక్టివ్‌గా ఉండాలని పేర్కొన్నది. 2021 జాబితా ప్రకారం హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానంలో 5,31,268 మంది ఓటర్లు, నల్లగొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల నియోజకవర్గంలో 5,05,565 మంది ఉన్నారని ప్రస్తావించింది. ఈ ఓటర్లతో పోలిస్తే ఇప్పటి వరకు ఫామ్-18 ద్వారా పేర్లను నమోదు చేసుకున్న గ్రాడ్యుయేట్లు 36%, 48% చొప్పున (సగటున 42%) ఉన్నారని, దీన్ని గమనంలోకి తీసుకుని ఎక్కువమందిని చేర్పించాలని సూచించింది. ఆ ప్రకారం ఒక్కో నియోజకవర్గంలో యావరేజ్‌గా 7 లక్షల మంది చొప్పున ఉంటారని అంచనా వేసుకున్నందున రోజుకు 2 చోట్లా కలిపి 65 వేల మందిని చేర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నది.
గాంధీభవన్‌లో ప్రత్యేక వార్ రూమ్
ఏ నియోజకవర్గంలో ఓటర్ల నమోదు ప్రక్రియ ఎలా ఉన్నదో పార్టీ రాష్ట్ర నాయకత్వానికి తెలిసేలా గాంధీభవన్‌లో డ్యాష్ బోర్డుతో కూడిన ‘వార్ రూమ్’ను ఏర్పాటు చేస్తున్నట్లు డాక్యుమెంట్ వివరించింది. రోజువారీ గణాంకాలన్నీ ఈ డ్యాష్ బోర్డులో రిఫ్లెక్ట్ అవుతాయని, ఫామ్-18 అంశాలకు సంబంధించి ప్రత్యేక హెల్ప్ లైన్ కూడా ఉంటుందని పేర్కొన్నది. ప్రతీ మండలంలో ఓటర్ ఎన్రోల్మెంట్ సౌకర్యంతో రోజువారీ నమోదు శిబిరాలను నిర్వహించాలని పేర్కొన్నది. కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, కాలనీల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నది.
సీరియస్ దృష్టి పెట్టకపోతే ప్రయోజనం లేదు
ప్రస్తుతం రోజుకు యావరేజ్‌గా 13 వేల ఫామ్-18 దరఖాస్తులు మాత్రమే వస్తున్నాయని పేర్కొన్న డాక్యుమెంట్… నవంబర్ 6 డెడ్‌లైన్‌గా ఉన్నందున అప్పటివరకు అర్హులైనవారు మిస్ కాకుండా చేర్పించే బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నది. ఓటర్లుగా పేర్లను నమోదు చేసుకున్న గడువు పూర్తయిన తర్వాత ఏం చేసినా ఫలితం ఉండదని, తక్కువ సమయం ఉన్నందున సీరియస్‌గా ఆలోచించి టాస్క్ పూర్తయ్యేలా చొరవ తీసుకోవాలని నొక్కిచెప్పింది. పోలింగ్ ఎప్పుడు జరిగినా, ప్రచారం ఎంత ఉధృతంగా చేసినా ఇప్పుడు ఓటర్లుగా చేర్పించడమే కీలక ఘట్టం అని స్పష్టం చేసింది.
సీఎం నుంచి ప్రత్యేక సందేశం
గ్రాడ్యుయేట్ ఓటరుగా సీఎం స్వయంగా ఫామ్-18 ద్వారా పేరును నమోదు చేసుకుని రాష్ట్రంలోని అర్హులైన గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ వీడియో సందేశాన్ని ఇవ్వాలన్నది కాంగ్రెస్ పార్టీ ప్లాన్. ప్రతీ రోజు సాయంత్రం 7 గంటలకల్లా పోలింగ్ బూత్‌ల వారీగా రాతపూర్వకంగా గణాంకాలను వార్ రూమ్‌కు పంపడం ఇన్చార్జిల బాధ్యత అని, ఆ గణాంకాల ఆధారంగా అతి తక్కువగా ఓటరు నమోదు యాక్టివిటీ ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాలను నేరుగా సీఎం సమీక్షించడం, అవసరమైన సూచనలను ఇన్చార్జిలకు ఇవ్వడం నవంబర్ 6 వరకూ కంటిన్యూ అవుతుందని ఆ డాక్యుమెంట్ పేర్కొన్నది.
స్థాయిలవారీగా బాధ్యతల అప్పగింత
అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఉన్న చోట ఇన్చార్జిలుగా నియమితులైనవారు బాధ్యతలు తీసుకోవాలి. వారికి అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించడంలో సీరియస్‌గా ఉండాలన్నది. మండల స్థాయిలో మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ స్థాయిలో అక్కడి పార్టీ నాయకులు బాధ్యత తీసుకోవాలని, బూత్ స్థాయిలో బీఎల్ఏ (బూత్ లెవల్ ఏజెంట్) బాధ్యత తీసుకుని అర్హులైన గ్రాడ్యుయేట్ ఓటర్లను గుర్తించి వారి ఇండ్లకు వెళ్లి ఓటర్లుగా ఫామ్-18 ద్వారా అప్లికేషన్ ఇచ్చి జాబితాలో చేర్పించేలా చొరవ తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇన్చార్జ్ మంత్రులు, డీసీసీ అధ్యక్షులు ప్రతీ రోజు జిల్లాలవారీగా సమీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది.
కీలకమైన మరికొన్ని బాధ్యతలు
రాష్ట్ర, జిల్లా స్థాయిలో అన్ని వర్గాల ప్రతనిధులతో సమావేశాలు నిర్వహించాలని, పార్టీ అనుబంధ విభాగాలను కూడా రంగంలోకి దించాలని పార్టీ స్పష్టమైన దిశానిర్దేశాన్ని ఆ డాక్యుమెంట్లో స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయ సంఘాలు, జూనియర్ లెక్చరర్లు, లెక్చరర్ల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లు, బ్యాంకు, రైల్వే ఉద్యోగులు, మైనారిటీ ఉద్యోగులు, విద్యార్థి, యువజన సంఘాలు, పౌర సమాజ ప్రతినిధులు, జర్నలిస్టు సంఘాలను కలవాలని సూచించింది. సీపీఐ, సీపీఎం, వాటి అనుబంధ సంస్థలను ఈ కార్యక్రమాల్లో భాగస్వాముల్ని చేయాలని వివరించింది. కాంగ్రెస్ తరఫున యువ గ్రాడ్యుయేట్ల కోసం ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళల కోసం మహిళా కాంగ్రెస్ బాధ్యులు, ఉద్యోగులు, కార్మికుల కోసం ఐఎన్టీయూసీ నేతలు రంగంలోకి దిగాలన్నది.
ఎవరి పక్షమో అంచనాకు రావాలి
పార్టీ టార్గెట్ ఇచ్చిందిగదా అనే ఉద్దేశంతో ఎన్రోల్మెంట్ పెంచడం ఒక్కటే బాధ్యుల బాధ్యత కాదని, అందులో కాంగ్రెస్‌కు ఓటు వేసే గ్రాడ్యుయేట్లను గుర్తించడం కీలకమని ఆ డాక్యుమెంట్ పేర్కొన్నది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్నవారిని ఓటర్లుగా నమోదు చేయించినా దానితో పార్టీకి వచ్చే ప్రయోజనం ఉండదని, పైగా అది ప్రత్యర్థులకు మేలు చేసినట్లవుతుందని, అందువల్ల ఓటర్లుగా ఎన్రోల్ చేయించే టైమ్‌లోనే వారు ఎవరి పక్షమో స్పష్టమైన అంచనాకు రావాలని పేర్కొన్నది. ఓటర్లుగా చేర్పించేందుకు నవంబరు 6 వరకే గడువు ఉన్నందున ప్రతీ గంటా, నిమిషం చాలా కీలకమైనదని, రానున్న 13 రోజుల పాటు విశ్రాంతి లేకుండా పకడ్బందీ షెడ్యూలు, ప్లానింగ్ రూపొందించుకుని టాస్క్ ను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
ఇది మీ ఎన్నిక.. గెలుపు మీదే
రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యత ఇన్చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలదేనని పార్టీ ఆ డాక్యుమెంట్లో స్పష్టం చేసింది. “ఎమ్మెల్యేల్లారా.. ఇది మీ ఎన్నిక.. గెలిచేది మీరేనని భావించండి.. ఎవరు ఫలితాలు సాధించారో నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.. మనకు మద్దతుగా నిలిచేవారిని ఓటర్లుగా నమోదు చేయించండి.. ఈ ఎన్నికల్లో మనకు ఓట్లు వేసేవారే.. మనకి వచ్చే ఓట్లే నిర్ణయాత్మకం.. ఇంకా మిగిలింది 13 రోజులే.. ఈ వారంలోనే మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ పరిచయస్తులు, వారి కుటుంబ సభ్యులను ఓటర్లుగా నమోదు చేయించండి.. ప్రతీ సాయంత్రం మీ నియోజకవర్గంలో నమోదైన సంఖ్యను నాకు తెలియజేయండి..” అని ఆ డాక్యుమెంట్లో సీఎం అప్పీల్‌ను పొందుపరిచింది.

