కలం, వెబ్‌డెస్క్: ఎల్‌నినో (El Nino) పరిస్థితులు తీవ్రంగా మారే అవకాశం ఉందని, ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కోబోతున్నామని, సాగునీటితో పాటు తాగునీటికి కూడా ఇబ్బందులు తలెత్తవచ్చని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన సబ్ కమిటీ సమావేశం అనంతరం సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కరోనా లాంటి పరిస్థితులు రావొచ్చని హెచ్చరించారు. జనాలు బయటకు కూడా రాలేని పరిస్థితి రావొచ్చని చెప్పారు. కరోనా విపత్తు సమయంలో అప్పటి సీఎం కేసీఆర్ వ్యవహరించిన తీరు వల్లే చాలామంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇప్పట్లో ఎల్‌నినో ప్రభావం తెలియకపోయినా జూలై వరకు దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. ప్రధాని మోదీ కరోనా సమయంలో ఏం చెప్పినా చేశారని, అలాగే ఇప్పుడు కూడా ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, మానవత్వాన్ని కూడగట్టుకుని ఈ విపత్తును ఎదుర్కొవాలని పిలుపునిచ్చారు.
ఈ ఎల్‌నినో పరిస్థితులపై కొందరు రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు. హరీశ్ రావు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను కోరారు. మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోనూ కరువు పరిస్థితులు నెలకొన్నాయని, అక్కడ కూడా నీటి కరువు వచ్చిందని చెప్పారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రజలందరి భాగస్వామ్యం ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. పరిస్థితులన్నీ అనుకూలమైనప్పుడు పాలన చేయడం సులువేనని సీఎం అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో పడుకొని ప్రణాళికలు చేస్తున్నారని, కేటీఆర్, హరీశ్ రావు పని గట్టుకొని రాష్ట్రమంతా తిరుగుతూ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా విద్యుత్ వినియోగం పెరిగిపోయిందని సీఎం తెలిపారు. ఏదో ఒక రకంగా రైతులకు న్యాయం చేయాలని విద్యుత్ అందించి పంటలను కాపాడుతున్నామని చెప్పారు. ఎండా కాలం వస్తే చుక్క నీరు దొరికే పరిస్థితి కూడా ఉండదన్నారు. అందుకే రైతులు పంటలు వేయొద్దని చెప్తున్నామని స్పష్టం చేశారు.
ఎల్‌నినోపై నిజాలు దాస్తే క్యాన్సర్‌లా వ్యాప్తి చెందుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రానున్న పంటలకు సాగు నీరు అందించడం అసాధ్యమని తేల్చి చెప్పారు. విద్యుత్ విషయంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డే టైమ్‌లో ఒక్క లైట్ కూడా వెలగకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. సోలార్ విద్యుత్ పలకలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. బయట అప్పులు తెచ్చి కొందామన్నా విద్యుత్ అందుబాటులో లేదన్నారు. స్వీయ నియంత్రణతోనే విద్యుత్ సమస్య ఎదుర్కోవచ్చని చెప్పారు. యాదాద్రి ప్లాంట్ విషయంలో బీఆర్ఎస్ నేతలను కట్టేసి కొట్టాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లక్ష కోట్ల దోపిడీ కోసం చేసిన కుట్ర యాదాద్రి ప్లాంట్ అని సీఎం ఆరోపించారు.

