మంగంపల్లి ఘటనపై ధర్మ సమాజ్ పార్టీ ధర్నా

కలం, వనపర్తి: మంగంపల్లి గ్రామంలో  దళిత యువకుడికి జరిగిన అవమానంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ధర్మ సమాజ్ పార్టీ, జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెల 12న జరిగిన మంగంపల్లి ఘటన(Mangampally Incident)ను నిరసిస్తూ శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్, రాజీవ్ చౌక్ లో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా కన్వీనర్ చిలుక బాలరాజ్ సాగర్ మాట్లాడుతూ.. మంగంపల్లికి చెందిన దళిత యువకుడు సుధీర్ ఆంజనేయస్వామి ఆలయంలోకి వెళ్తుండగా, స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మేనమామ వెంకటరామిరెడ్డి కులం పేరుతో దూషించి, ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.

ఈ ఘటన రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కులకు, దళితుల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా ఉందన్నారు. బాధ్యులను వెంటనే అరెస్టు చేసి, చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసు యంత్రాంగం ఈ వ్యవహారంలో నిర్లక్ష్యం వహిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకుడు మధు హెచ్చరించారు. బాధితుడికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ ధర్నాకు బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు గట్టు యాదవ్, మాజీ జడ్పీటీసీ శేఖర్ నాయక్, రాములు యాదవ్, కురుమన్న, అశోక్, సూర్య, సుధాకర్, మన్యం, శాంతన్న, బలరాంతో పాటు ఎంఆర్‌పీఎస్‌, కుల అసమానతల వ్యతిరేక పోరాట సమితి నాయకుడు గోవింద్, వివిధ కుల సంఘాల ప్రతినిధులు సంఘీభావం తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>